న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది(2025)లో చివరిదైన తన రేడియో కార్యక్రమం ‘మన కీ బాత్’లో ప్రసంగించారు. 2025 భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఏడాదిగా అభివర్ణించారు. ఈ సంవత్సరం దేశానికి అమితమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్న ఆయన.. ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునే ఎన్నో ఘట్టాలు ఈ ఏడాదిలో చోటుచేసుకున్నాయన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ, ప్రపంచంలో తన స్థానాన్ని మరింత ఉన్నతంగా నిలబెట్టుకున్నదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది దేశ భద్రతకు సంబంధించి ఒక కీలకమైన మలుపుగా నిలిచిందని, భారత్ తన భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడదనే స్పష్టమైన సందేశాన్ని ఈ ఆపరేషన్ అందించిందని అన్నారు. ఈ విజయంతో దేశ ప్రజల్లో భారత సైన్యం సామర్థ్యంపై నమ్మకం మరింత బలపడిందని అన్నారు. క్రీడారంగంలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేసిన ప్రధాని.. 2025 భారత క్రీడా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదిగిన సంవత్సరం అని అన్నారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం, మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్‌ను తొలిసారిగా సాధించడం దేశానికి అమితమైన ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పారా అథ్లెట్లు కూడా అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించి, దేశ ప్రతిష్ఠను పెంచారని ప్రధాని పేర్కొన్నారు.
విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని, అంతరిక్ష పరిశోధనల్లో భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. భారత అంతరిక్షయాత్రికుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం దేశానికి గర్వకారణమని అన్నారు. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా కూడా 2025 విశేషమైన సంవత్సరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన వేడుకలు జాతీయ ఐక్యతను ప్రతిబింబించాయన్నారు. మహా కుంభమేళా ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయిలో విజయవంతంగా జరిగిందన్నారు. అయోధ్యలో రామమందిరానికి సంబంధించిన ఘట్టాలు కోట్లాది మంది హృదయాల్లో భావోద్వేగాలను రేకెత్తించాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పర్యావరణ సంరక్షణ విషయంలోనూ భారత్ ముందడుగు వేసిందని, జంతు సంరక్షణ చర్యలతో చిరుతపులుల సంఖ్య పెరగడం దేశం సాధించిన విజయాలకు ఉదాహరణలని ప్రధాని అన్నారు. ప్రసంగం ముగింపులో ప్రధాని మోదీ.. 2025 భారత్‌కు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన సంవత్సరం అని పునరుద్ఘాటించారు. ఈ విశ్వాసంతోనే దేశం 2026లోకి అడుగుపెడుతున్నదని, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో భారత్ ముందుకు సాగుతున్నదని అన్నారు.ప్రతి పౌరుడు దేశ అభివృద్ధిలో భాగస్వామిగా మారాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: 2026కు 26 ట్రెండ్స్.. ఏఐ నుంచి జీరో వేస్ట్ వరకూ..


