విహారాల సీజన్‌ వింటర్‌..! సన్‌రైజ్‌ కోసం అక్కడ వాలిపోదామా..! | Winter is perfect for sunrise vacations | Sakshi
Sakshi News home page

విహారాల సీజన్‌ వింటర్‌..! సన్‌రైజ్‌ కోసం అక్కడ వాలిపోదామా..!

Dec 28 2025 4:07 PM | Updated on Dec 28 2025 4:14 PM

Winter is perfect for sunrise vacations

నిండా దుప్పటి ముసుగేసుకుని నిద్రలోకి జారుకోడానికి ఇష్టపడే పాత రోజులకు భిన్నంగా సూర్యోదయ కాంతిని ఆస్వాదించాలి అనుకుంటున్నారు నేటి తరం యువత. కురిసే మంచుకు చిక్కకుండా దాక్కునే ఒరవడికి భిన్నంగా మంచుకురిసే వేళ.. మెరిసే అందాలను వెతుక్కుంటున్నారు. ప్రతి చలికాలం కనిపించే ఈ సరదాలు.. సిసలైన చలిపులిని రుచి చూపిస్తున్న
సీజన్‌లో సాహసికుల సరదాలు సిటీలో మరింత ఊపందుకున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం వీక్షణకు కొండలు, గుట్టలమీదకు చేరుతున్నారు ఔత్సాహికులు. బ్రేక్‌ఫాస్ట్‌ టూర్స్‌ నుంచి బోన్‌ ఫైర్‌ వరకూ రెడీ అంటూ ఏడాదికి ఓసారి వచ్చే ఈ సీజన్‌లో అరుదుగా కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. 

స్వభావరీత్యా హైదరాబాద్‌ నగరం చల్లగా ఉండే ప్రాంతం.. శతాబ్దాల క్రితం మన సిటీని వేసవి విడిదిగా కూడా ప్రముఖులు పరిగణించేవారనే విషయం తెలిసిందే. అయితే రాను రాను కాంక్రీట్‌ జంగిల్‌లా మారిన నగరం తన అసలు స్వభావానికి దూరమైపోతోంది. అయితే ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయే శీతాకాలంలో మాత్రం సిటీ పరిసరాలు రెట్టింపు ఆకర్షణతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ అందాలు ఆస్వాదించమంటూ సిటీజనులను ఆహ్వానిస్తున్నాయి. 

సన్‌రైజ్‌.. సర్‌‘ప్రైజ్‌’
పొగమంచుతో కూడిన ఉదయాలను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. ఈ సీజన్‌లో ఆకట్టుకునే సన్‌రైజ్‌లు వీక్షించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీని కోసం బద్ధకాన్ని పక్కనబెట్టి తెల్లవారుఝామున 5 గంటలకే నిద్రలేని పలు ప్రాంతాలకు పయనమవుతున్నారు. 

అందమైన సూర్యోదయాల కోసం ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (కోకాపేట్‌/నార్సింగి) లతో పాటు మహేంద్ర హిల్స్, ఖాజాగూడ హిల్స్‌ (బౌల్డర్‌ హిల్స్‌), మౌలాలీ హిల్స్‌.. వంటి కొండ ప్రాంతాలకు అలాగే నీటిలో తేలియాడే సూర్య కిరణాలను వీక్షించేందుకు అమీన్‌పూర్‌ సరస్సు, గండిపేట (ఉస్మాన్‌ సాగర్‌) రాజేంద్రనగర్‌ సమీపంలోని పీరంచెరువు సరస్సు, కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు అనుకునేవారు పోచారం ఆనకట్ట/సరస్సును విహారాలకు విడిదిగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో, అద్భుతమైన సహజ కాంతి కోసం కోహెడ గుట్ట ఎక్కువ మంది ఛాయిస్‌. 

వర్కవుట్‌.. ట్రెక్కింగ్‌ 
శరీరం నిదానంగా కదులుతూ క్రమక్రమంగా చురుకుగా మారే వాతావరణ పరిస్థితుల్లో తక్కువ అలసట, ఎక్కువ సంతృప్తి అందిస్తుంది. అందుకే యువత క్రీడలు, ముఖ్యంగా తెల్లవారుజామున ట్రెక్కింగ్‌ ఎంచుకునేందుకు అనువైన సీజన్‌ ఇది. ‘హైదరాబాద్‌లోని ప్రకృతి అందాలను అన్వేషించడానికి శీతాకాలం ఉత్తమ సమయం. మేం ఈ సీజన్‌లో వికారాబాద్‌ లేదా నగర శివార్లలో ట్రెక్కింగ్‌కు వెళ్తాం. చల్లని వాతావరణం, మా శారీరక సామర్థ్యాన్ని సానపెడుతోంది.

ఓ ఆరోగ్యకరమైన ఈవెంట్‌ను ఆస్వాదించేలా చేస్తుంది’ అని కళాశాల విద్యారి్థని దీపా సమిరవ్‌ దేశాయ్‌ అంటున్నారు. వ్యాయామాలు, ఆటలు కూడా సిటిజనుల సీజనల్‌ ఫన్‌లో భాగమే. ‘మా స్నేహితుల బృందం శీతాకాలపు ఉదయాలను ఎక్కువగా సద్వినియోగం చేసుకునేందుకు సైక్లింగ్‌కు వెళ్తాం.. అలాగే ప్రశాంతమైన  పరిసరాల్లో యోగా సాధన చేస్తాం.. దీని కోసం హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ వంటి ప్రాంతాలకు వెళతాం’ అని కార్పొరేట్‌ ఉద్యోగిని సోనియా గాలా చెబుతున్నారు. 

బ్రేక్‌ ఫాస్ట్‌ టూర్స్‌ షురూ.. 
ఈ సీజన్‌లో ఉదయాన్నే అల్పాహారపు వింటర్‌ టూర్స్‌ ఆస్వాదించే సమూహాలు కూడా ఉన్నాయి. అటువంటి క్లబ్‌ ది పొంగల్‌ గ్రూప్, ఇది ఈ సీజన్‌లో శాఖాహార అల్పాహారం కోసం బృందాలుగా బయటకు వెళుతుంది. సఫిల్‌గూడ నివాసి రాజేష్‌ కళ్యాణన్‌ మాట్లాడుతూ.. ‘మా బృందంలో చాలా మంది సభ్యులు ముఖ్యమైన సంస్థల్లో అధికారులు, కాబట్టి ఆదివారాలను విహారయాత్రల కోసం ప్రత్యేకిస్తాం. ఇతర శీతాకాలపు ఉదయాలు మాకు రైట్‌ టైమ్‌’ అని చెప్పారు.  

సన్‌సెట్స్‌.. అదిరే స్పాట్స్‌
సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయాలు కూడా ఈ సీజన్‌లో కనువిందు చేస్తాయి. నగరం చుట్టుపక్కల అటువంటి అందమైన సూర్యాస్తమయాల కోసం మౌలాలీ హిల్స్, విస్పర్‌ వ్యాలీ, ట్యాంక్‌ బండ్, ఖాజాగూడ హిల్స్, బుద్ధ విహార్, బిర్లా మందిర్, ఉస్మాన్‌ సాగర్, కుతుబ్‌ షాహీ టూంబ్స్, గోల్కొండ కోట,  షామీర్‌పేట్‌ లేక్, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్, లాస్ట్‌ హౌస్‌ కాఫీ, వంటి ప్రదేశాలు బాగా పేరొందాయి. నగరంలోని బైద బాటిల్‌ వంటి కేఫ్స్, ఆక్వా ది పార్క్‌ వంటి హోటల్స్‌ కూడా ప్రత్యేకంగా సన్‌ రైజ్, సన్‌సెట్స్‌ ఏర్పాట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.  

సాహసాల సీజన్‌.. 
ఈ సీజన్‌లో వారాంతాల్లో సాయంత్రం వేళ బహిరంగ సాహసాలకు కూడా డిమాండ్‌ పెరుగుతుంది. మన్నెగూడలోని డెక్కన్‌ ట్రైల్స్‌ మేనేజర్‌ ఫిలిప్‌ ప్రసాద్‌ ప్రకారం, ‘బోన్‌ ఫైర్లు, తెల్లవారుజామున ట్రెక్కింగ్, టెంట్లలో ఆకాశం కింద క్యాంపింగ్‌ చేయడానికి చాలా డిమాండ్‌ ఉంది. ఎక్కువ. వీటి కోసం వారాంతాల్లో కార్పొరేట్‌ బుకింగ్స్‌ ఎక్కువగా ఉంటాయి’ అని చెప్పారు.  

(చదవండి:  వర్క్‌–లైఫ్‌'లలో ఏది ముఖ్యం? జెన్‌-జడ్‌ యువతరం ఏం అంటుందంటే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement