ఇనుప కంచెల మధ్య చిక్కుకుని అవస్థలు పడుతున్న భక్తులు (ఇన్‌సెట్‌లో)ఏడుస్తున్న చిన్నారి
తిరుమల, శ్రీశైల క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు
సౌకర్యాల కల్పనలో విఫలమైన ప్రభుత్వం, పాలకవర్గాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సెలవుల నేపథ్యంలో తిరుమల, శ్రీశైల క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ఫలితంగా భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. దేవదేవుల దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వసతుల కల్పన, దర్శనం కల్పనలో ప్రభుత్వం, టీటీడీ ఘోరంగా విఫలమయ్యాయి. పైగా శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది.
ఆన్‌లైన్ శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా దర్శనం కొనసాగుతోంది. తిరుపతిలో శుక్రవారం ఉదయం చేపట్టిన దివ్యదర్శనం టోకెన్ల పంపిణీ కొద్దిసేపటికే ముగిసింది. ఉదయం 9 గంటలకే టోకెన్లు అయిపోవడంతో భూదేవి కాంప్లెక్స్ క్యూలైన్లకు అధికారులు తాళాలు వేశారు. దీంతో భక్తులు ఉసూరుమన్నారు. తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద గురువారం తోపులాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
శుక్రవారం కూడా భక్తులు భారీగా తరలిరావడంతో అలిపిరి టోల్ గేట్, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద రద్దీ భారీగా కనిపించింది. తిరుమలలో సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 30 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. 30 నిముషాల్లో 15 వేల టికెట్లు ఎలా పూర్తవుతాయని ప్రశి్నస్తున్నారు.
మల్లన్న సన్నిధిలోనూ అదే తీరు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలోనూ మల్లికార్జున స్వామి దర్శనానికి తరలివచి్చన భక్తులు అవస్థలు పడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం చేతులెత్తేసింది. వీఐపీల సేవలో తరిస్తున్న అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యుల తీరూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సామాన్య భక్తులకు కనీసం తాగునీరూ అందించలేని దుస్థితి నెలకొంది.
బిస్కెట్లు, అల్పాహారం, చంటిపిల్లలకు పాలూ ఇవ్వలేక దేవస్థానం చేతులెత్తేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది భక్తులు గంటల తరబడి కంపార్ట్‌మెంట్లలో ఉండలేక గోడలు దూకి బయటికి వచ్చేయడం గమనార్హం. భక్తుల రద్దీ దృష్ట్యా సీఆర్‌వో కార్యాలయం వద్ద వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపును దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది.


