బహుభాషా నటీనటులకు అడ్వాంటేజ్ ఏమిటంటే ఏదో ఓ భాషలో అవకాశాలు వస్తూనే ఉండటం. అలా 2016లో వంద కథే హెల్లా అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన శాండిల్ వుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్. ఆ తరువాత తెలుగులో శ్రీకారం, నాని 'గ్యాంగ్ లీడర్' వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను పొందారు.ఆ తరువాత వెంటనే కోలీవుడ్ ఆహ్వానించింది. ఇక్కడ డాక్టర్, డాన్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. సూర్య సరసన ఎదర్కుమ్ తుణిందవన్, ధనుష్‌తో కలిసి కెప్టెన్ మిల్లర్ చిత్రాల్లో నటించారు.

అలా ఈమె చివరిగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించారు. అదేవిధంగా తెలుగులో ఓజీ చిత్రంలో నటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక మోహన్‌ను మళ్లీ మాతృభాష ఆహ్వానించింది. ఈమె చాలా గ్యాప్ తరువాత కన్నడంలో భారీ చిత్రంలో నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, యువ నటుడు డాలీ ధనుంజయ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్..
ఇందులో నటి ప్రియాంక మోహన్ కథానాయకిగా నటిస్తున్నారు. వైశాక్ జే.ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంత్ ఎం.రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటి ప్రియాంక మోహన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నట్లు ప్రియాంక మోహన్ పేర్కొన్నారు.


