బెంగళూరు: ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, వృక్షమాతగా పేరు తెచ్చుకున్న సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు. 114 ఏళ్ల తిమ్మక్క కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె అక్కడే తుది శ్వాస విడిచారు.
1911 జూన్ 30న జన్మించిన తిమ్మక్క బెంగళూరు దక్షిణ జిల్లాలోని హులికల్–కుదూర్ మధ్య 4.5 కి.మీ. విస్తీర్ణంలో 385 మర్రి చెట్లను నాటడంతో ఆమెకు ‘సాలుమరద’అనే పేరు వచ్చింది. నిరక్షరాస్యురాలైన తిమ్మక్కకు పిల్లలు లేకపోవడంతో.. మొక్కలనే పిల్లల్లా పెంచారు. ఆమె చేసిన కృషికి 2019లో పద్మశ్రీ అందుకున్నారు. అంతకుముందు హంపి విశ్వవిద్యాలయం నుంచి 2010లో నాడోజ అవారు, 1995లో జాతీయ పౌర పురస్కారం, 1997లో ఇందిరా ప్రియదర్శిని వృష మిత్ర అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు.
ప్రముఖుల సంతాపం..
తిమ్మక్క మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం తెలిపారు. ‘వేలాది చెట్లను నాటి, వాటిని తన సొంత పిల్లలలాగా పోషించిన తిమ్మక్క, తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసింది. పర్యావరణం పట్ల అమితమైన ప్రేమ కలిగిన ఆమెకు మరణం లేదు. ఆమె మరణం ఈ ప్రాంతానికి తీరని లోటు’అని పేర్కన్నారు. తిమ్మక్క మృతిపట్ల మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, కర్ణాటక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.


