తమిళనాడు ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్టాలిన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మద్రాస్ యూనివర్సిటీ సవరణ బిల్లును రాష్ట్రపతి భవన్ మంగళవారం వెనక్కి పంపించేసింది. మూడేళ్లుగా రాష్ట్రపతి వద్ద ఈ బిల్లు పెండింగ్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే.
మద్రాస్ యూనివర్సిటీ చట్టం 1923 ప్రకారం.. తమిళనాడు గవర్నర్ యూనివర్సిటీకి ఎక్స్-ఆఫీషియో చాన్సలర్. వైస్ చాన్సలర్ నియామకం, తొలగింపు తదితర హక్కులు గవర్నర్ వద్దే ఉన్నాయి. అయితే.. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవితో స్టాలిన్ సర్కార్‌కు పొసగడం లేదు. గవర్నర్ వల్లే తమిళనాడులో వర్సిటీల వీసీ నియామకాలు నిలిచిపోయాయని ప్రభుత్వం తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మద్రాస్ వర్సిటీ బిల్లు ద్వారా గవర్నర్ అధికారాలకు చెక్ పెట్టాలని స్టాలిన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వైస్ చాన్సలర్‌ను నియమించుకునే అధికారం పొందడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలకు అనుగుణంగా యూనివర్సిటీ పాలనను మార్చడం, అలాగే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీని యూనివర్సిటీ సిండికేట్‌లో సభ్యుడిగా చేర్చడం తదితర అంశాలను బిల్లులో తమిళనాడు ప్రభుత్వం పొందుపరిచింది. అయితే ఈ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపగా.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లును ఆమోదించకుండానే తిరిగి పంపించారు.


