సీఎం స్టాలిన్
రైల్వే పనులకు వెంటనే నిధులు మంజూరు చేయండి
ప్రధాని మోదీకికి సీఎం స్టాలిన్ లేఖ
తమిళనాడులో రైల్వే ప్రాజెక్టులకు నిధులు వెంటనే విడుదల చేయాలి, నిలిచిపోయిన పనులు పునర్ ప్రారంభించాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాశారు.
సాక్షి, చైన్నె: తమిళనాడులో అమలవుతున్న రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఆలస్యం లేకుండా పూర్తిగా విడుదల చేయాలని, నిలిచిపోయిన ముఖ్యమైన రైల్వే పనులను మళ్లీ ప్రారంభించాలని సీఎం స్టాలిన్ కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం లేఖ రాశారు. ఈ లేఖలో తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైల్వే ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిని వివరించారు. ముఖ్యంగా భూ సేకరణకు సంబంధించిన నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం వల్ల అనేక ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశంలో ప్రధాని వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని సమస్యలకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే ప్రాజెక్టుల కోసం మొత్తం 2500.61 హెక్టార్ల భూమి సేకరణకు పరిపాలనా అనుమతి ఇచ్చినట్లు సీఎం పేర్కొన్నారు. అయితే, ఇందులో 931.52 హెక్టార్ల భూమికి ఇప్పటికీ రైల్వే శాఖ నిధులు కేటాయించలేదని తెలిపారు. 19 ముఖ్య రైల్వే ప్రాజెక్టుల కోసం అవసరమైన భూమిలో 94 శాతం భూ సేకరణ పూర్తై రైల్వే శాఖకు అప్పగించినప్పటికీ, ఐదు ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్ అందలేదని లేఖలో వెల్లడించారు.
కీలక రైల్వే ప్రాజెక్టులు..
దిండివనం–నగరి, మదురై–తూత్తుకుడి, మణియాచ్చి–నాగర్‌కోయిల్, కన్యాకుమారి –నాగర్‌కోయిల్ డబ్లింగ్, చైన్నె బీచ్–కోరుక్కుపేట 3వ, 4వ ట్రాక్‌లు, విల్లు పురం –దిండిగల్ వంటి పలు ప్రాజెక్టుల్లో భూ సేకరణ పూర్తయిందని తెలిపారు. అయితే నిధులలో జాప్యం తప్పలేదని వివరించారు. భూ యజమానులకు సకాలంలో పరిహారం అందించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అయితే రైల్వే శాఖ నిధులను విడతల వారీగా విడుదల చేయడం వల్ల ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని విమర్శించారు.
తిరువనంతపురం–కన్యాకుమారి డబుల్ లైన్ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ, ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.289.78 కోట్ల పరిహార నిధులు ఇంకా విడుదల కాలేదని తెలిపారు. దేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక రాష్ట్రంగా ఉన్న తమిళనాడు, తయారీ, పరిశ్రమలు, ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా కొత్త రైల్వే ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రైల్వే ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఎగ్మోర్ రైల్వే స్టేషన్


