కొరుక్కుపేట: సింగపెరుమాళ్ కోవిల్ సమీపంలోఉన్న వైద్య వ్యర్థాల దహన కేంద్రంలో, వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న సుమారు 6.6 టన్నుల గంజాయి, 125 కిలోల అత్యంత నాణ్యమైన మాదకద్రవ్యాలు, 11,700 మాదకద్రవ్యాల మాత్రలను (వీటి మొత్తం విలువ రూ. 20.5 కోట్లు) పోలీసులు ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని తిలకించారు. ఇందులో తాంబరం మున్సిపల్ కమిషనర్, 2వ అవడి జాయింట్ కమిషనర్, కాంచీపురం డీఐజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు, అధికారులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేశారు.
తిరుత్తణి ఆలయ హుండీ కానుకలు రూ. 2.52 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక తెప్పోత్సవ వేడుకలు సందర్భంగా భక్తులు రూ.2.52 కోట్ల కానుకలు చెల్లించినట్లు ఆలయ అధికారి తెలిపారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి 8 వరకు ఆడికృత్తిక తెప్పోత్సవ వేడుకలు ఐదు రోజుల పాటు కోలాహలంగా నిర్వహించారు. ఇందులో తమిళనాడుతో పాటు ఆంధ్ర,కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 7 లక్షల మంది భక్తులు పాల్గొని కావళ్లు చెల్లించి తమ మొక్కులు తీర్చుకునే విధంగా ఆలయ హుండీల్లో నగలు, నగదు సమర్పించారు. భక్తులు చెల్లించిన హుండీ కానుకలు సోమవారం ఉదయం ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో హుండీలు తెరిచి వసంత మండపంలో లెక్కింపు చేపట్టారు. ఆలయ సిబ్బందితో పాటూ తాత్కాలిక సిబ్బందితో కలిసి 100 మంది పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కానుకల లెక్కింపు చేపట్టారు. కానుకల లెక్కింపులో చివరిలో నగదుగా రూ. 2 కోట్ల 52 లక్షల 74 వేలు, 165 గ్రాముల బంగారం, 10,044 గ్రాముల వెండి భక్తులు చవరి పది రోజుల్లో కానుకలగా చెల్లించినట్లు ఆలయ అధికారి తెలిపారు.
ఎంఎస్‌ఎంఈల కోసం
సంస్కరణలు
– ఫిస్మే డిమాండ్
సాక్షి, చైన్నె: దేశంలో వస్తు సేవల పన్ను విధానం ప్రవేశపెట్టి దాదాపు పదేళ్లు పూర్తికావస్తున్న తరుణంలో, భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చారు. జీఎస్‌టీ దేశీయ పరోక్ష పన్నుల వ్యవస్థను ఏకీకృతం చేసి, పన్ను వసూళ్లను పెంచినప్పటికీ, దేశంలో కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో సులభతర వాణిజ్యం లభించలేదని ఫిస్మే పేర్కొంది.ఈ విషయంగా ఫిస్మే సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ స్థానికంగా మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో జీఎస్‌టీ సంస్కరణలు అనేవి పన్ను రేట్లను తగ్గించడం గురించి కాదని, పన్ను విధివిధానాల అనుసరణను మరింత సరళంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చడం గురించి అని స్పష్టం చేశారు. తమ సిఫార్సులు పన్ను మినహాయింపుల కోసం కాదని, నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలపై ఉన్న అదనపు నిబంధనల భారాన్ని తగ్గించి, వారి వర్కింగ్ క్యాపిటల్‌ను లాక్ అవ్వకుండా కాపాడేందుకేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెక్ట్ జనరేషన్ జీఎస్‌టీ సంస్కరణలకు పట్టుబడుతూ ఆయన తమ డిమాండ్లను వివరించారు.సప్లయర్ల తప్పుకు కొనుగోలుదారులపై శిక్ష వద్దు అని కోరారు.వర్కింగ్ క్యాపిటల్ లాక్ అవ్వకూడదని, వన్ పాన్ – వన్ అడ్మినిస్ట్రేషన్, సాంకేతికత సులభతరం వివాదాల తగ్గింపు – డిజిటల్ ఎకానమీకి అనుకూలం వంటి డిమాండ్లను ఆయన వివరించారు. జీఎస్‌టీని కేవలం పన్ను వసూలు చేసే వ్యవస్థలా కాకుండా, పరిశ్రమల వృద్ధికి సహకరించే వ్యవస్థగా మార్చడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని వ్యాఖ్యానించారు.
పెంపుడు జంతువును విచ్చలవిడిగా వదిలేస్తే..
కొరుక్కుపేట: చైన్నెలో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇళ్లలో పెంపుడు జంతువులుగా పెంచుకునే కుక్కలు కూడా కొన్నిసార్లు బహిరంగ ప్రదేశాల్లో వదిలివేస్తున్నారు. సాధారణంగా అద్దె ఇళ్లలో నివసించేవారు, అపార్ట్‌మెంట్లలో నివసించేవారు పెంపుడు జంతువులను అనుమతించరు. దీనివల్ల పెంపుడు జంతువులుగా పెంచుకున్న కుక్కలు వీధుల్లో వదిలివేస్తున్నారు. కాగా ఇకపై బహిరంగ ప్రదేశాలలో పెంపుడు జంతువులను వదిలివేస్తే, వాటి యజమానులపై రూ. 25,000 జరిమానా విధించాలని కార్పొరేషన్ యోచిస్తోంది. తదుపరి కౌన్సిల్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపయాలని నిర్ణయించినట్లు తెలిసింది.


