డ్రగ్స్‌ రహిత తమిళనాడే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత తమిళనాడే లక్ష్యం

Aug 12 2026 12:16 AM | Updated on Aug 12 2026 12:16 AM

● రాష్ట్రస్థాయి ప్రతిజ్ఞను ప్రారంభించిన సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె: తమిళనాడును మాదకద్రవ్యాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలో మంగళవారం చైన్నెలోని ప్రెసిడెన్సీ కాలేజీ వేదికగా ‘డ్రగ్స్‌ రహిత తమిళనాడు‘ నినాదంతో రాష్ట్రస్థాయి బృహత్తర ప్రతిజ్ఞా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాలు, పొగాకు రహిత క్యాంపస్‌ అవగాహన ప్రచారాన్ని సీఎం విజయ్‌ ప్రారంభించారు. అలాగే డ్రగ్స్‌ నిర్మూలనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి పతకాలను, అవగాహన కల్పించిన విద్యార్థి సంఘాలకు నగదు బహుమతులను అందజేశారు.

50 వేల మంది విద్యార్థుల ప్రతిజ్ఞ

మాదకద్రవ్యాలు , నిషేధిత పొగాకు ఉత్పత్తుల పై తమిళనాడు ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్‌’ (ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము) విధానాన్ని అవలంబిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చైన్నె వేదికపై 2,000 మంది విద్యార్థులు నేరుగా పాల్గొనగా, రాష్ట్రంలోని 37 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో సుమారు 50,000 మందికి పైగా విద్యార్థులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏకకాలంలో ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఐటీ ఉద్యోగులు, వైద్యులు , పునరావాస కేంద్రాలలో చికిత్స పొందుతున్న వారు కూడా ఈ బృహత్‌ ప్రతిజ్ఞలో భాగస్వాములయ్యారు.

రూ. 264 కోట్లతో యాంటీ నార్కోటిక్స్‌ ఫోర్స్‌

పొరుగు రాష్ట్రాల నుండి జాతీయ రహదారులు, రైళ్లు , తీరప్రాంత గ్రామాల ద్వారా గంజాయి రవాణా అవుతోందని, అలాగే పట్టణ యువత, హాస్టల్‌ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని చాక్లెట్ల రూపంలో, రహస్య యాప్‌ల ద్వారా సింథటిక్‌ డ్రగ్స్‌ , పెయిన్‌ కిల్లర్‌ మాత్రలను సరఫరా చేస్తున్న ముఠాల పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ఈసందర్భంగా సీఎం ప్రకటించారు. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడానికి రాష్ట్రవ్యాప్తంగా 65 ప్రత్యేక విభాగాలను (జిల్లాల్లో 37, పోలీస్‌ కమిషనరేట్లలో 28) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం రూ. 264.14 కోట్ల నిధులను ఈసందర్భంగా కేటాయించారు. ఈ విభాగం కోసం 2,017 కొత్త పోస్టులతో కలిపి మొత్తం 2,079 మంది సిబ్బందితో కూడిన ప్రత్యేక బలగాల నియమకంను ఆమోదించారు.

కఠిన చర్యలు – ఆస్తుల జప్తు

ఈ ఏడాది మే నుంచి జూలై వరకు మూడు నెలల్లోనే 3,116 ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదు చేసి, 4,138 మంది నిందితులను అరెస్ట్‌ చేశామని, వారి నుండి 4,201 కిలోల గంజాయి, 1.12 లక్షల డ్రగ్‌ మాత్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 222 మందిపై గుండా యాక్ట్‌ ప్రయోగించారని, . అలాగే డ్రగ్స్‌ ద్వారా సంపాదించిన నిధులపై నిఘా పెట్టి 158 బ్యాంక్‌ ఖాతాలను జప్తు చేశామన్నారు. నిషేధిత గుట్కా, పాన్‌ మసాలా విక్రయాలపై జరిపిన దాడుల్లో 77,438 కిలోల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. విద్యాసంస్థల చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన 78 ప్రధాన కేసులపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకున్నారని వివరించారు.

రూ. 70 కోట్లతో పునరావాస నిధి..

డ్రగ్స్‌ మహమ్మారి బారిన పడిన బాధితులకు మానవీయ కోణంలో ఉచిత చికిత్స, ఉపాధి శిక్షణ అందించడానికి బడ్జెట్‌లో రూ.70 కోట్ల కేటాయింపుతో ఒక ప్రత్యేక పునరావాస నిధిని ప్రభుత్వం సీఎం ప్రకటించారు. ప్రస్తుతం 28 ప్రత్యేక డి–అడిక్షన్‌ కేంద్రాల ద్వారా ఉచిత సేవలు అందిస్తుండగా, అలాగే విద్యాసంస్థల్లో అవగాహన కోసం రూ.7 కోట్ల బడ్జెట్‌ ను కేటాయించారు. డ్రగ్స్‌ సమాచారాన్ని రహస్యంగా చేరవేయడానికి 10581’ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను, డ్రగ్‌ ఫ్రీ తమిలనాడు యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

లక్ష ప్రైజ్‌ మనీ – పతకాల బహూకరణ

ఈ కార్యక్రమ వేదిక నుండి సీఎం విజయ్‌ బటన్‌ నొక్కి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చెంగల్పట్టు, తిరునెల్వేలి, కోయంబత్తూరు తంజావూరు లల్లా పరిధిలోని నాలుగు ప్రాంతాలలో పట్టుబడిన సుమారు 8,800 కిలోల మాదకద్రవ్యాలను, 64,000 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తులను శాసీ్త్రయంగా ధ్వంసం చేసే ప్రక్రియను వీక్షించారు. అనంతరం, డ్రగ్స్‌ నియంత్రణలో అద్భుతమైన సేవలు అందించిన 15 మంది ఉత్తమ పోలీస్‌ అధికారులకు 2026 ముఖ్యమంత్రి పోలీస్‌ పతకాలను అందజేశారు. అలాగే విద్యార్థుల్లో చైతన్యం తెచ్చిన బెస్ట్‌ యాంటీ–డ్రగ్‌ క్లబ్‌లు, వాలంటీర్‌ గ్రూపులకు మొదటి బహుమతిగా రూ. లక్ష, ద్వితీయ బహుమతిగా రూ. 75,000, తృతీయ బహుమతిగా రూ. 50,000 నగదు డిమాండ్‌ చెక్కులను, ప్రశంసా పత్రాలను ముఖ్యమంత్రి అందజేసి సత్కరించారు. ఈ సమయంలో ఓ పోలీసు అధికారి తన కుమారుడ్ని పోలీసు యూనిఫాంతో తీసుకు రావడంతో సీఎం ఆ బాలుడ్ని ఎత్తుకుని కాసేపు లాలించారు. అలాగే పాఠశాల, కళాశాల విద్యార్థులను వేదికపైకి పిలిపించి మరీ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement