ప్రవేశపెట్టిన మంత్రి అరుణ్‌రాజ్
బీజేపీ మినహా అన్ని పార్టీల మద్దతు
సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభలో మంగళవారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అధికార టీవీకే తో పాటు డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే తదితర పార్టీలు మద్దతు పలికాయి. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి అరుణ్‌రాజ్ సభలో మాట్లాడుతూ, నీట్ విధానం వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించారు. వైద్య విద్య అనేది కేవలం ఒక వృత్తిపరమైన కోర్సు మాత్రమే కాదని, అది మానవ ప్రాణాలను కాపాడే ఒక పవిత్రమైన సేవగా వివరించారు. ఈ విద్యావకాశాలు కేవలం ఆర్థిక బలమున్న వారికే కాకుండా, ప్రతిభ, అంకితభావం ఉన్న ప్రతి ఒక్కరికీ సమానంగా అందాలన్నదే తమిళనాడు ప్రభుత్వ విధానం అని మంత్రి స్పష్టం చేశారు. తమిళనాడు సుదీర్ఘకాలంగా సామాజిక న్యాయం ఆధారిత విద్యా విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. గతంలో 12వ తరగతి (ఇంటర్మీడియట్) మార్కుల ఆధారంగా వైద్య సీట్ల భర్తీ జరిగినప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేదలు, మొదటి తరం పట్టభద్రులు, వెనుకబడిన వర్గాల వారికి వైద్య విద్యలో అద్భుతమైన అవకాశాలు లభించాయని వివరించారు. ఇందుకు ఫలితంగా తాజాగా దేశంలోనే అత్యుత్తమ ప్రజా ఆరోగ్య వ్యవస్థ కలిగిన రాష్ట్రాల్లో తమిళనాడు ముందంజలో ఉందని పేర్కొన్నారు. రోజువారీ కూలీలు, రైతుల పిల్లలు లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ స్థాయిలో శిక్షణ పొంద లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నీట్ విధానం సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి బదులు, వాటిని మరింత పెంచుతోందన్నారు. మంత్రి ప్రసంగం అనంతరం, నీట్ నుండి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక తీర్మానాన్ని అసెంబ్లీ అధికారికంగా ఆమోదించింది.
టీవీకే పాలనలో భారీగా రాష్ట్ర అప్పులు : పళణి
అసెంబ్లీలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి,శాసన సభాపక్ష నేత పళని స్వామి ప్రసంగించారు. టీవీకే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కేవలం 3 నెలల్లోనే రూ. 20 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఐదేళ్ల కాలపరిమితి ముగిసేసరికి రాష్ట్ర అప్పులు ప్రస్తుతం ఉన్న రూ. 10 లక్షల కోట్ల నుండి ఏకంగా రూ. 20 లక్షల కోట్లకు చేరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సవరించిన బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో పళణి స్వామి ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వానికై నా మొదటి 100 రోజుల పాలన అత్యంత కీలకమైనదని, అప్పుడే ఆ ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలు , వాటిని చేరుకునే మార్గాలు స్పష్టమవుతాయన్నారు. ఆ నమ్మకం ఆధారంగానే పెట్టుబడులు కూడా వస్తాయంటూ గతంలో అన్నాడీఎంకే, డీఎంకే ప్రభుత్వాల హయాంలో విడుదల చేసిన శ్వేతపత్రాలను గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం తమిళనాడు అప్పుల భారం రూ. 13 లక్షల కోట్లుగా ఉందని, రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఆదాయ లోటు పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీల భారం కొండలా పేరుకుపోయిందని, ఈ బడ్జెట్‌లో ఆర్థిక లోటును సరిచేసే ఎలాంటి ప్రణాళికలు కనిపించడం లేదని మండి పడ్డారు. ప్రభుత్వం పాత పథకాలకు పేర్లు మార్చడంపై ఆయన ఈసందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మాట్లాడకుండానే పనిచేస్తాను’ అనే విధానం స్వాగతించదగ్గదే అయినప్పటికీ.. కొన్ని సమయాల్లో మాట్లాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఈ దృష్ట్యా, ఇకనైనా ముఖ్యమంత్రి మౌనం వీడాలని సూచించారు. రవాణా రంగం, నిరుద్యోగం , రైతుల సమస్యలపై కూడా ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది 1,000 బస్సులు కొంటామని బడ్జెట్‌లో చెప్పారని,అ యితే, కానీ ఈ ఏడాది ఇప్పటికే ముగిసిపోతోందని, రాబోయే 4 ఏళ్లలో ఎన్ని బస్సులు కొంటారో స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు.
సీఎం ఫోన్ కాల్ అంటేనే భయం : ఉదయనిధి
సభలో ఐటీ, సీబీఐ . రాజకీయ ఒత్తిడిపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ , మంత్రి ఆనంద్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.గత ప్రభుత్వాల కాలంలో ఉదయం పూట ముఖ్యమంత్రి నుండి ఫోన్ వస్తుందంటేనే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ తప్పు జరిగిందో అని ఒత్తిడికి గురయ్యేవారని డీఎంకే సభ్యులు గుర్తు చేశారు. దీనిపై ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల గురించి పత్రికల్లో వచ్చే వార్తలను చూసి, వాటిపై తక్షణ వివరణ కోరడానికే తమ ముఖ్యమంత్రి ఫోన్ చేస్తుంటారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఆ కాల్స్ వస్తాయి తప్ప, అందులో భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదం
సభలో పట్టాలు, సీబీఐ, ఐటీ కేసులపై చర్చ
అసెంబ్లీలో ముఖ్యంగా రాష్ట్రంలో భూమి పట్టాల జారీ, నదులు–చెరువుల పూడికతీత పనులు , సిబీఐ ,ఐటీ, ఈడీ కేసులు వ్యవహారాల చర్చరసవత్తరంగాసాగింది. అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చలో టీవీకేఎమ్మెల్యే సుకుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అర్హులైన వారికి పట్టాలు జారీ చేయలేదని ఆరోపించారు. ఇందులో మాజీ మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్ జోక్యం చేసుకుని ఈ ఆరోపణలపై స్పందించారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా, కేవలం గత 5 సంవత్సరాల స్టాలిన్ పాలనలోనే తమిళనాడు చరిత్రలో రికార్డు స్థాయిలో 23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని సభకు వివరించారు. ఈ సమయంలో మంత్రి సెంగోట్టయన్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ, భూమిని కేటాయించకుండా కేవలం కాగితాలపై పట్టాలు జారీ చేయడంలో ఉన్న సాంకేతిక లోపాలు తమకు తెలుసనని, ప్రస్తుతం వాటిని క్షేత్రస్థాయిలో సరిదిద్దేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జలవనరుల సంరక్షణ , చెరువుల పునరుద్ధరణపై జలవనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్ సభకు కీలక సమాచారం అందించారు. చైన్నెలోని కూవం, అడయార్ నదులతో పాటు వేళ చ్చేరి, నారాయణపురం వంటి ప్రధాన చెరువులను ప్రైవేటు భాగస్వామ్యంతో పూడికతీత పనులను ప్రారంభించడానికి ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసినట్లు ప్రకటించారు. 22 వేల చెరువుల పునరుద్ధరణకు చర్చలు తీసుకున్నామని ఈసందర్భంగా , పీఎంకే ఎమ్మెల్యే సౌమ్య అన్బుమణి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ధర్మపురి జిల్లాకు సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రైతుల డిమాండ్లన్నీ నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారంపై వేలు వ్యాఖ్యలు
సభలో డీఎంకే సభ్యుడు ఏ.వి. వేలు మాట్లాడుతూ, శాసనసభ కార్యకలాపాలన్నింటినీ పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేయడం శుభపరిణామన్నారు. దీనివల్ల ప్రజలకు సభలో ఏం జరుగుతుందో తక్షణమే తెలుస్తుందని, అయితే స్పీకర్ పరిధిలోని నిర్ణయాలను గౌరవిస్తూ సభా మర్యాదలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ ప్రభాకర్ స్పందిస్తూ, సభలో సభ్యులు మాట్లాడే సమయంలో హుందాగా, గౌరవంగా, మర్యాదగా మాట్లాడే అలవాటు చేసుకోవాలని సూచించారు.


