సాక్షి, చైన్నె: పోలీసు శాఖలో అవినీతిని అరికట్టేందుకు చైన్నె సిటీ పోలీస్ కమిషనర్ ఎ. అమల్‌రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అధికారులు ఎవరైనా లంచం అడిగితే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక ప్రత్యేక ’అవినీతి నిరోధక విభాగాన్ని’ ప్రారంభించారు. అంతేకాకుండా, ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఒక ప్రత్యేక మొబైల్ నంబర్‌ను కూడా ఆయన విడుదల చేశారు. ఈ మేరకు చైన్నె పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.పోలీసు శాఖలో జవాబుదారీతనం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. పోలీసు కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు మెజారిటీ సిబ్బంది ఎంతో నిజాయితీగా, అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు.అ యితే, కొంతమంది చేసే తప్పుడు పనుల వల్ల మొత్తం పోలీసు శాఖకే చెడ్డపేరు వస్తోందన్నారు. దీనికి పూర్తిస్థాయిలో ముగింపు పలికేందుకే చైన్నె పోలీసు శాఖలో ఈ కొత్త యాంటీ కరప్షన్ వింగ్‌ను ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు.
వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు!
పోలీసులు తమ విధులను నిర్వహించడానికి ప్రజల నుండి లంచం డిమాండ్ చేసినా, లేదా ఇబ్బందులకు గురిచేసినా ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. అవినీతిపై ఫిర్యాదుల కోసం 78717 – 23000 అనే మొబైల్ నంబర్‌ను కేటాయించారు. ప్రజలు ఈ నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి గానీ, లేదా వాట్సాప్ ద్వారా గానీ సమాచారం అందించవచ్చు అని పిలుపు నిచ్చారు. ఫిర్యాదు చేసే వారు తమ పేరు లేదా ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని, అందులో నిజముందని తేలితే సదరు పోలీసు అధికారులపై ఎలాంటి మొహమాటం లేకుండా తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.


