వేలూరు: వేలూరు జిల్లాను మత్తులేని జిల్లాగా తయారు చేసేందుకు పోలీసు ఎస్పీ శివరామన్ అధ్యక్షతన పలు అవగాహన కార్యక్రమాలతో పాటూ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోను పోలీసులు తరచూ వాహణ తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా వేలూరు జిల్లా పూర్తిగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు తరచూ సరిహద్దు ప్రాంతంలో గంజా, గుట్కా వంటి వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచారు. తనిఖీల అనంతరమే తమిళనాడులోకి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కాట్పాడి పోలీసులు కాట్పాడిలోని ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో సోదాలు చేశారు. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న ఒకరి బ్యాగును తనిఖీ చేయగా అందులో పూర్తిగా గుట్కా,హాన్స్, పాన్‌పరాగ్, విమల్ వంటి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ బ్యాగుతో పాటు వాటిని తీసుకొస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా అతను చైన్నె తాంబరం సమీపంలోని ముడిచూరుకు చెందిన రూబనాథన్‌గా తెలిసింది. ఇతను ఆంధ్ర రాష్ట్రం చిత్తూరులో గుట్కా ఫ్యాకెట్లును కొనుగోలు చేసి తాంబరం సమీపంలోని ముడిచూరు ప్రాంతంలో పలు దుకాణాలకు విక్రయం చేస్తున్నట్లు తెలియడంతో అరెస్ట్ చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


