తిరుత్తణి: పచ్చైయమ్మన్ ఆలయ అగ్నిగుండ వేడుకల్లో 500కు పైగా భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. వివరాలు.. తిరుత్తణి శివారులోని మురుక్కంపట్టులో ప్రసిద్ధి చెందిన మన్నాదీశ్వరర్ సమేత పచ్చైయమ్మన్ ఆలయంలో అగ్నిగుండ వేడుకలు గతనెల 31న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. వేడుకలు సందర్భంగా రోజూ అమ్మవారికి విశిష్ట అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు కంకణాలు ధరించి దీక్షలు చేపట్టారు. వేడుకలు సందర్భంగా రోజూ ఆధ్యాత్మిక ప్రవచనాలు, వీధి నాటకం ప్రదర్శించారు. వేడుకల్లో చివరిరోజైన సోమవారం మహిళలు ఆలయం వద్ద పొంగళ్లు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం అగ్నిగుండంకు ప్రత్యేక పూజలు చేపట్టి అగ్నిగుండం ముందు పుష్పలంకరణలో పచ్చైయమ్మన్ కొలువుదీరగా విద్యుద్దీపాలకాంతుల నడుమ కంకణాలు ధరించిన భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. రాత్రి అమ్మవారు గ్రామ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేడుకల ఏర్పాట్లను పంచాయతీ మాజీ సర్పంచ్ గుణసుందరి పొన్నుస్వామి ఆలయ నిర్వాహకులు చేపట్టారు.


