స్టాలిన్‌ అలా అనకపోయి ఉంటే... ఇదంతా జరిగేదా? | Stalin Statement: The Trigger Behind Vijays New Alliance In Tamil Nadu | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌ అలా అనకపోయి ఉంటే... ఇదంతా జరిగేదా?

Jun 30 2026 1:59 PM | Updated on Jun 30 2026 2:31 PM

Stalin Statement: The Trigger Behind Vijays New Alliance In Tamil Nadu

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగబోతోందా? అధికారంలోకి వచ్చిన రెండు నెలలు కూడా పూర్తికాకముందే సీఎం జోసెఫ్‌ విజయ్‌ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు. డీఎంకేను పూర్తిగా ఒంటరి చేయడమే లక్ష్యంగా దాని మాజీ మిత్రపక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బుధవారం జరగనున్న కీలక సమావేశం తమిళ రాజకీయాల దిశనే మార్చే అవకాశముందనే చర్చ సాగుతోంది.

సీఎం జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తన మిత్రపక్షాలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌, విడుతలై చిరుతైగళ్‌ కట్చి (VCK), సీపీఐ, సీపీఎం, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (IUML), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (MDMK) వంటి పార్టీలను ఆహ్వానించారు. వీటిలో చాలా పార్టీలు గతంలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌లో భాగస్వాములే కావడం గమనార్హం.

అధికారికంగా డీఎంకేకు గుడ్‌బై?
ఈ సమావేశానికి ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న విడుతలై చిరుతైగళ్‌ కట్చి (VCK) అధినేత తిరుమావళవన్‌ పార్టీ అధికారికంగా డీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే ప్రభుత్వానికి VCK మద్దతు ప్రకటించినప్పటికీ, ఇప్పుడు అధికారికంగా డీఎంకేతో బంధం తెంచుకోవడం పెద్ద రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు.

డీఎంకే మాజీ మిత్రులంతా విజయ్‌ వైపు?
ఇప్పటికే కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంఎల్‌ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వంలో భాగమయ్యారు. ఇటీవల వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకేతో దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికింది. అయితే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం డీఎంకేతోనే కొనసాగుతున్నారు. ఇక సీపీఐ, సీపీఎం వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సెక్యులర్‌ ఫ్రంట్‌కు శ్రీకారం
విజయ్‌ నేతృత్వంలో కొత్త "సెక్యులర్‌ కూటమి" ఏర్పాటు దిశగా ఈ సమావేశం తొలి అడుగుగా భావిస్తున్నారు. ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా.. ప్రభుత్వాన్ని మరింత స్థిరంగా ఉంచడం, మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, భవిష్యత్‌ స్థానిక సంస్థలు, ఉపఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే వ్యూహంపై చర్చించే అవకాశముంది.

స్టాలిన్‌ వ్యాఖ్యలే కారణమా?
ఇటీవల డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్‌ "తమిళనాడులో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు" అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాతే విజయ్‌ మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రక్రియ వేగం పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టడంతో పాటు, డీఎంకే మాజీ మిత్రులంతా తమవైపే ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని అత్యంత ప్రాధాన్యంగా నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో "స్టాలిన్‌ ఆ వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే... విజయ్‌ ఇంత వేగంగా కొత్త ఫ్రంట్‌ ఏర్పాటుకు పావులు కదిపేవారా?" అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న విజయ్‌ టీమ్‌..
ఈ కీలక సమావేశానికి హాజరుకావాలని టీవీకే సీనియర్‌ నేతలు, మంత్రులు ఎన్‌. ఆనంద్‌, ఆదవ్‌ అర్జున్‌ స్వయంగా వివిధ పార్టీల అగ్రనేతలను కలిసి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా వీసీకే అధినేత తిరుమావళవన్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

డీఎంకేకు ఇది పెద్ద రాజకీయ సవాలేనా?
2019 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమే తమిళ రాజకీయాలను శాసించింది. కానీ ఇప్పుడు అదే కూటమిలోని భాగస్వాములు ఒక్కొక్కరుగా విజయ్‌ వైపు చేరడం సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీగానే మిగులుతుందా? లేక కొత్త రాజకీయ ఫ్రంట్‌కు అధికారిక శ్రీకారం చుడుతుందా? అన్నది ఒక ప్రశ్న అయితే... స్టాలిన్‌ చేసిన ఒక్క వ్యాఖ్యే ఈ మొత్తం రాజకీయ వేగానికి కారణమైందా? అన్న ప్రశ్న కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అంతే ఆసక్తిగా చర్చనీయాంశమవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement