చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్ తాజాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి చెందిన మంత్రులు ఆధవ్ అర్జున, సీటీఆర్ నిర్మల్ కుమార్‌లకు పరువునష్టం నోటీసులు పంపారు. తమపై చేసిన అవినీతి ఆరోపణలను వెనక్కి తీసుకుని, 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శబరీశన్ ఆ నోటీసులో పేర్కొన్నారు.
36 శాఖల అవినీతి ఆరోపణలపై ధ్వజం
ఆధవ్ అర్జునకు పంపిన నోటీసు ప్రకారం.. ఆయన మీడియా సమావేశంలో శబరీశన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలోని 36 శాఖల్లో భారీగా సొమ్ములు వసూలు చేశారని, అందులో తలా 16 శాఖల నిధులను ఉదయనిధి స్టాలిన్, శబరీశన్‌లకు పంచిపెట్టారని ఆధవ్ అర్జున ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలు, ప్రాంతీయ టీవీ ఛానళ్లలో విపరీతంగా ప్రచారం కావడమే కాకుండా, దాదాపు నాలుగు లక్షల కంటే ఎక్కువ వీక్షణలు సాధించాయని, దీనివల్ల తన ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లిందని శబరీశన్ ఆ నోటీసులో పేర్కొన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్మల్ కుమార్ వ్యాఖ్యలు
మరో టీవీకే నేత సీటీఆర్ నిర్మల్ కుమార్‌కు పంపిన ప్రత్యేక నోటీసులో, విద్యుత్ ఛార్జీల పెంపునకు శబరీశన్‌కు ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ ఆదాయ వ్యయాలు, అప్పులు భారీగా పెరిగాయని నిర్మల్ కుమార్ ప్రెస్ మీట్‌లో విమర్శించారు. అంతేకాకుండా, ఈ విద్యుత్ బిల్లుల పెంపు వల్ల లాభపడింది ఎవరు? ఒక కుటుంబమా, అల్లుడా లేదా కుమారుడా? అని ప్రశ్నిస్తూ శబరీశన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
15 రోజుల డెడ్‌లైన్.. లీగల్ యాక్షన్ హెచ్చరిక
ఈ నేపథ్యంలోనే శబరీశన్ ఇద్దరు నేతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. టీవీకే నేతలు చేసిన ఈ నిరాధార ఆరోపణలు, వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, బహిరంగంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసులు అందిన 15 రోజుల్లోగా ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో, వారిపై తదుపరి చట్టపరమైన న్యాయ పోరాటాన్ని ప్రారంభించడం మినహా తనకు మరో మార్గం లేదని శబరీశన్ హెచ్చరించారు. ఈ పరిణామం తమిళనాట రాజకీయ వేడిని మరింత పెంచింది.


