నల్సర్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ వివాదంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెనకడుగు వేసినా.. వేడి ఇప్పుట్లో చల్లారేలా కనిపించడం లేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ మిశ్రా రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ పట్టబడుతోంది. అవసరమైతే ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై, సీజేపీ ఆరోపణలపై మనన్ మిశ్రా కాస్త భిన్నంగా స్పందించారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు చేసిన వాళ్లకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ విషయంలో తమ లక్ష్యం కూడా అదే అని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. వారికి చెప్పదలచుకున్నది ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటమే మా ఉద్దేశం. ఈ విషయంలో మా ప్రయోజనాలు, వారి లక్ష్యం ఒకటే’’ అని మనన్ మిశ్రా తెలిపారు.
వివాదానికి కారణం ఇదే
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యే ప్రతిపాదనపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో బీసీఐ.. 2026లో నాల్సార్ నుంచి న్యాయ విద్య పూర్తి చేసే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు విద్యార్థుల చర్యలకు మొత్తం బ్యాచ్‌ను బాధ్యులను చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
‘‘తొందరపాటులో నిర్ణయం తీసుకున్నాం’’
తొలుత ఇచ్చిన ఆదేశాలపై మనన్ మిశ్రా వివరణ ఇచ్చారు. విద్యార్థులకు నష్టం కలిగించాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదన్నారు. ‘‘ఆ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నదే. విషయం కౌన్సిల్ దృష్టికి వచ్చిన వెంటనే నిలిపివేశాం. సీనియర్ సభ్యులతో చర్చించిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకున్నాం. దీనిపై ఎలాంటి విచారణ అవసరం లేదు’’ అని తెలిపారు.
‘‘బీసీఐకి, సీజేపీకి ఘర్షణ లేదు’’
విద్యార్థుల ప్రయోజనాల విషయంలో బీసీఐ, సీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మనన్ మిశ్రా స్పష్టం చేశారు. ‘‘ఎవరైనా అపార్థంలో ఉంటే స్పష్టం చేయాలనుకుంటున్నాను. దేశ యువత ప్రయోజనాలను కాపాడటం మనందరి బాధ్యత. అభిజీత్ దీప్కే కోరేది కూడా అదే.. మేము కోరేది కూడా అదే. కాబట్టి ఎలాంటి ఘర్షణ లేదు’’ అని పేర్కొన్నారు.
రూ.14 కోట్ల ఆరోపణలపై స్పందన
బీసీఐ సమావేశాలు, సదస్సుల కోసం రూ.14 కోట్లు ఖర్చు చేసిందన్న సౌరవ్ దాస్ ఆరోపణలపైనా మనన్ మిశ్రా స్పందించారు. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, అలాంటి భారీ ఖర్చులు ఏవీ జరగలేదని చెప్పారు. బీసీఐ వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహిస్తుందని, వాటిని రూ.14 కోట్ల వ్యయంతో నిర్వహించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
సీజేపీ మాత్రం విజయంగా..
బీసీఐ ఆదేశాల ఉపసంహరణను సీజేపీ నేతలు తమ విజయంగా అభివర్ణించారు. సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో ‘‘ఇట్స్ డన్ బ్రో’’ అంటూ స్పందించారు. గతంలో తమ ఉద్యమ సమయంలో వైరల్‌గా మారిన నినాదాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. అయితే మనన్ మిశ్రా రాజీనామా కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు.
సుప్రీం నోటీసులు
ఇదిలా ఉంటే.. ఇది పూర్తిగా సీజేఐకి, విద్యార్థులకు సంబంధించిన అంశమని సుప్రీం కోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్.. విద్యార్థులు తప్పు చేసినా, నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉంటుందని చెప్పింది. బార్ కౌన్సిల్ జోక్యం అనవసరమని వ్యాఖ్యానించింది. అసలు అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ బీసీఐకు నోటీసులు పంపింది.
మరోవైపు.. నిరసన తెలిపిన విద్యార్థులను విచారించాలంటూ గత ఆదేశాల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించడంపైనా నల్సార్ స్పందించింది. అది తమకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది.


