భారతదేశ భవిష్యత్తును నిర్దేశించేది, నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండేది, 143 కోట్ల భారతీయుల తలరాతలను మార్చేది పార్లమెంట్. తమ తమ ప్రాంతాలలో చోటు చేసుకున్న సమస్యలను ఎంపీలు ప్రస్తావించేందుకు పార్లమెంటు ఓ కీలకమైన వేదిక. ఇప్పుడు కేవలం ఆరోపణలు, విమర్శలకే ఎక్కువ సమయం సరిపోతోంది.
దేశంలో పెద్ద గుంతలతో నిండిన రహదారులను దాటడం, మునిగి పోయిన నగరాల్లో నడవడం, అంతులేని ఉద్యోగ దరఖాస్తు లతో చెమటలు పట్టడం, దొంగతనాల వల్ల కోట్లు నష్టపోయే విద్యుత్ రంగానికి ధర చెల్లించడం దేశంలో సాధారణ దృశ్యాలు అయ్యాయి. ప్రతి వారం ప్రజల తెరలపై ఒక వంతెన వంగిపోవడం, ఒక కారును రహదారి మింగేయడం వంటి దృశ్యాలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, ప్రభుత్వ సమాధానాలు చూస్తే దేశంలో పరిస్థితి కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.
‘ఎన్ని రహదారులు కూలిపోయాయి?’ అనే ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం 49 అని. ఇది 2014 నుండి 2025 వరకు ఉన్న డేటా. ప్రతి వర్షాకాలం కల్లోలం సృష్టిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టణ వరదల బాధ్యతను రాష్ట్రాలు, స్థానిక సంస్థలపై మోపుతుంది. ఇది రాజ్యాంగపరంగా సరైనదే. అయితే, అతి పెద్ద పట్టణా భివృద్ధి కార్యక్రమం ఢిల్లీ నుండి నిర్వహించబడుతోంది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ కింద 8,064 ప్రాజెక్టులలో 7,790 పూర్తయ్యాయి. ఖర్చు రూ. 1,56,257 కోట్లు. ఖర్చు అంటే కేవలం డబ్బు కదలిక మాత్రమే, పరిష్కారం కాదు.
ఈ వారం ఎంపీలు నీటి కాలుష్యం, అంచనాలు, ప్రమాణాలు, పరిష్కారాలపై కూడా గొంతెత్తారు. 2023–24 నుండి 2.52 కోట్ల ప్రయోగశాల నమూనాల సేకరణ జరిగిందనీ, 2.87 కోట్ల ఫీల్డ్ పరీక్షలు జరిగాయనీ, ట్యాంకర్ మాఫియా నీటి కొరత నిజమనీ ప్రభుత్వం అంగీకరించింది.
ఇక ప్రాథమిక విద్య విషయానికి వస్తే, భవిష్యత్తు ఆశల వెన్నె ముక విరిగిపోయింది. ప్రభుత్వం 10.05 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 11.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. ప్రైవేట్ రంగం 3.42 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 8.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. విధానాలు, కంప్యూటరైజేషన్ గురించి చర్చల మధ్య ఈ వివరాలు వెల్లడయ్యాయి. 73,481 పాఠశాలలకు విద్యుత్ లేదు. 1,00,843 పాఠశాలల్లో ఒక్క గురువు మాత్రమే ఉన్నారు. అందుకే యువత వ్యవస్థలోని సమస్యలతో పోరాడు తున్నారు. మొన్న జంతర్ మంతర్‌లో, ఇప్పుడు జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటకల్లో కనిపిస్తున్న ఆగ్రహం చదువు, ఉపాధి రంగా లపై అసంతృప్తిని ఎలుగెత్తి చాటుతున్నది.
ఇంతలోపే ఆగస్ట్ 15 వచ్చేసింది. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించడం మామూలే. కానీ రోజురోజుకూ రూపాయి మరింత బలహీనమవుతోంది. ముడి చమురు ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆర్థిక లోటు పెరుగుతోంది. దివాళా చట్టం కింద 2020 నుండి డిసెంబర్ 2025 వరకు 25,900 కేసులు దాఖలయ్యాయి. పాలనలో బాధ్యత, సమర్థత లోపించడం వల్లనే ఈ సమస్యలు కొనసాగుతున్నాయి.
– కృష్ణ తేజ, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి


