చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డీలిమిటేషన్ ప్రక్రియను మద్దతిచ్చే ఏ విధమైన ప్రయత్నాన్నైనా ఏకగ్రీవంగా వ్యతిరేకించాలని నిర్ణయించింది. ఆ మేరకు సీఎం విజయ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది.
రాష్ట్రంలో కనీసం మరో 40–50 సంవత్సరాల పాటు చట్ట సభల సభ్యుల సంఖ్యలో ఎటువంటి మార్పు తాము అంగీకరించబోమన్నట్లు అఖిల పక్ష భేటీలో నిర్ణయించాయి. ఈ భేటీకి టీవీకే కూటమి పార్టీలైన కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీల ఎంపీలతో పాటు, స్నేహ పూర్వకంగా వ్యవహరించే సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల ప్రతినిధులు మెుత్తంగా 21 మంది ఈ భేటీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాడు హక్కులను పరిరక్షించాలనే విషయంలో సంపూర్ణ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు నేతలు తెలిపారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఎంపీలు హాజరు కాలేదు దీనిపై సీఎం విజయ్ స్పందించారు.
విజయ్ మాట్లాడుతూ.. "ఆరు పర్యాయాలు తమిళనాడును పాలించిన పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసిన వ్యవస్థాపక నాయకులు ఉన్న పార్టీ సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరం" అని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ జోతిమణి మాట్లాడుతూ.. “మేము డీలిమిటేషన్‌ను సమర్థించం. ముఖ్యమంత్రి విజయ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి నిర్ణయం. డీలిమిటేషన్ అమలు చేస్తే ప్రజాస్వామ్యం తన అసలైన రూపంలో ఇక మిగలదు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలు, హక్కులను కాపాడటానికి ముఖ్యమంత్రి తన నిబద్ధతను మరోసారి స్పష్టం చేశారు” అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలని, ఎటువంటి మార్పునూ తాము అంగీకరించబోమని నేతలు స్పష్టం చేశారు.


