ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు పశ్చిమ బెంగాల్ అడ్డాగా మారిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అలాంటప్పుడు పహల్గాం దాడిని కేంద్రమే జరిపించిందా? అని నిలదీశారామె. మంగళవారం బంకురా బిర్సింగ్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ..
బెంగాల్‌లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని, ఉగ్రవాదులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ఆ లెక్కన జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు లేరంటే.. పహల్గాం దాడి ఎలా జరిగింది? దాన్ని మీరే చేయించారా?.. దేశ రాజధానిలో జరిగిన దాడికి కారణం ఎవరు?(ఎర్రకోట దాడిని ఉద్దేశించి..) అని ప్రశ్నించారామె.
ప్రధాని మోదీని మహాభారతంలో దుర్యోధనుడిగా.. అమిత్ షాను దుశ్శాసనుడితో ఆమె పోల్చారు. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు.. ఇక్కడి నుంచి సమాచారం సేకరించేందుకు వచ్చారు. ఎన్నికల సమయంలోనే ఆ దుర్యోధన దుశ్వాసనలకు బెంగాల్ గుర్తుకు వస్తుంది. ఓట్ల కోసం ఎగబడి వచ్చేస్తుంటారు అని మండిపడ్డారామె.
ఇక తీవ్ర చర్చనీయాంశమైన ఎన్నికల జాబితా వివాదం (SIR) ప్రస్తావిస్తూ కేంద్రంపై టీఎంసీ అధినేత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ ప్రజలను కేంద్రం ఎస్‌ఐఆర్ పేరుతో వేధిస్తోంది. కోటిన్నర ఓట్లను తొలగించే యత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో.. రాజ్‌బన్షీలు, మటువాలు, ఆదివాసీలు లక్ష్యంగా మారతున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎస్‌ఐఆర్ నిర్వహించడం పెద్ద మోసం. ఇది ఇలాగే కొనసాగితే చివరికి మీరు (అమిత్ షా) మరియు మీ కుమారుడు మాత్రమే మిగిలిపోతారు అని మమతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆ రాష్ట్రంపై దృష్టిసారించింది. ఈ నెల 20న బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించారు. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం మరో అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో..
మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతోందని ఆరోపించారు. అలాగే..
మమత పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని.. ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అందకుండా టీఎంసీ సర్కార్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని బెంగాల్ ప్రజలను కోరారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని.. అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమికొడతామని హామీ ఇచ్చారు.


