మనుషులుగా మానవత్వాన్నిమంట గలిపారు. కనీస వృత్తి ధర్మాన్ని పాటించ లేదు. మానవ విలువల్ని మరిచిపోయిన ఘటన పలువురి హృదయాలను కలిచి వేసింది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది ఈ అమానుషం. బాధితుడు 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, రైల్వేస్‌లో సీనియర్ క్లర్క్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఆ చుట్టుపక్కల ఆయనకు మంచి వ్యక్తిగా పేరుంది. 2016లో భార్య మరణించడంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. 27 ఏళ్ల కుమార్తె రష్మి మానసిక వికలాంగురాలు. దీంతో తనకు, తన బిడ్డకు సాయంగా ఉంటారనే ఆలోచనతో ఒక జంటను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. అన్నివిధాలా తోడు నీడగా ఉంటారనే ఉద్దేశంతో రాంప్రకాష్ కుష్వాహా, అతని భార్య రాందేవి అనే భార్యాభర్తల్ని కేర్‌టేకర్లుగా నియమించుకుని, ఇంట్లోనే చోటిచ్చారు ఓం ప్రకాష్. అయితే వారి బలహీనతను ఆసరాగా తీసుకున్న ఈ జంట క్రూరత్వాన్ని బయట పెట్టుకుంది. యజమానులకు ఆహారం, వైద్య సంరక్షణలాంటివేవీ పట్టించుకోలేదు. రాను రాను వారికి తిండీ, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. క్రమంగా ఇంటిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అలా ఐదేళ్లపాటు వీరి ఆగడాలు సాగాయి. దీంతో ఆహారం లేక ఓం ప్రకాష్ చిక్కిశల్యమై పోయి ప్రాణాలు విడిచారు.
ఓంప్రకాష్ మరణం గురించి కుటుంబానికి సమాచారం అందించడంతో ఈ జంట దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఇంటికి చేరిన బంధువులు అక్కడి దృశ్యాలను షాక్ అయ్యారు. ఇక కుమార్తె రష్మి చీకటి గదిలో నగ్నంగా, స్పృహ లేకుండా కనిపించింది. దాదాపు చావు అంచులకు చేరిపోయింది. తన అన్న, కుమార్తె రష్మిని గ్రౌండ్ ఫ్లోర్‌కు పరిమితం చేసి, పైభాగంలో వారు హాయిగా జీవిస్తున్నారని ఓంప్రకాష్ సోదరుడు అమర్ సింగ్ ఆరోపించారు. బంధువులు ఎవరొచ్చినా, కలవడానికి ఇష్టం పడటం లేదంటూ తిప్పి పంపించేవారని తెలిపారు. ఓం ప్రకాష్ మర్యాదస్తుడనీ, చాలా గౌరవప్రద వ్యక్తి అంటూ ఆయన మరణంపై పొరుగువారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆకలితో రష్మి దేహం శుష్కించిపోయిందనీ, ఒంటిమీద కొంచెం కూడా కండలేక ఎముకల గూడులా ఉందని బంధువు పుష్ప సింగ్ రాథోడ్ తెలిపారు. రష్మి ఇప్పుడు కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంది, బాధ్యులకు కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం
ఓంప్రకాష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలు పెట్టారు. పోస్ట్‌మార్టం, ఇతర వైద్య, ఫోరెన్సిక్ ఫలితాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
ఇదీ చదవండి: హాస్టల్‌లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం


