బెంగళూరు: అక్టోబర్ 29న వివాహం. హనీమూన్‌లో గొడవ ఆపై ఆత్మహత్యలతో బెంగళూరు సూరజ్ శివన్న (36), గణవి (26) నూతన దంపతుల జీవితం అర్ధాంతరంగా ముగిసింది. గణవి మొదట బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడగా, రెండు రోజుల తర్వాత సూరజ్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక హోటల్‌లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఒకదానికొకటి వెయ్యి కిలోమీటర్ల దూరంలో.. రెండు రోజుల వ్యవధిలో చోటుచేసుకోవడం కలకలం రేపింది.
గత నెల వివాహం హనీమూన్ కోసం శివన్న,గణవి శ్రీలంకకు వెళ్లారు. అక్కడి వెళ్లిన ఆ జంటకు మధ్యలోనే గొడవలు తలెత్తడంతో తిరిగి బెంగళూరుకు వచ్చారు. గణవి తన పుట్టింటికి వెళ్లింది. అత్తింట్లో ఎదురైన అవమానం, తిరస్కారం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె కుటుంబం ఆరోపిస్తుండగా.. డిసెంబర్ 23న ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరింది. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరికి మృతి చెందింది.
గణవి మరణం తర్వాత ఆమె కుటుంబం సూరజ్, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య సూరజ్ తన తల్లి జయంతితో కలిసి బెంగళూరును విడిచి నాగపూర్‌కి వెళ్లాడు. అక్కడ వార్ధా రోడ్‌లోని ఒక హోటల్‌లో ఉరి వేసుకుని మృతి చెందాడు. అదే సమయంలో అతని తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన కొత్తగా పెళ్లైన జంట జీవితం ఎంతటి విషాదాంతానికి దారితీసిందో చూపిస్తోంది. కుటుంబ తగాదాలు, డౌరీ హరాస్మెంట్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు సమాజంలో ఇంకా ఎంతటి ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది.


