రాజకీయ పరిపాలన అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కే తెలియదా? ఒకవైపు సీఎం చంద్రబాబేమో పదే పదే పొలిటికల్ గవర్నెన్స్ అంటూ అధికారులకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. ఆ విషయం తెలిసినా మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ చంద్రబాబుకు అసంతృప్తి కలుగుతుందో అని దానిని ఎమ్మెల్యేలపై నెట్టివేస్తూ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎమ్మెల్యేల దందా గురించి పవన్ ప్రస్తావించడం తప్పు కాదు. కాకపోతే అదేదో కేవలం ఎమ్మెల్యేలకి సంబంధించిన అంశమని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది.
నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన సాగాలి కాని చంద్రబాబు నియంతృత్వంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏ పని చేయవద్దని బహిరంగంగా చెప్పి ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు కూడా అధికారులకు పార్టీ పరమైన ఆదేశాలు ఇస్తూ మొత్తం వ్యవహారాన్ని ఏకపక్షం చేస్తున్నారు. టీడీపీ ఐడీ కార్డుతో వచ్చే వారిని కూర్చొబెట్టి మర్యాదలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సూచన సంగతి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడినా పోలీసు వ్యవస్థ వారి జోలికి వెళ్లడానికే జంకుతోంది. పైగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపైన అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. రాజకీయ పాలన అని దీనికి ముద్దు పేరు పెట్టుకున్నారు.
మరి పవన్ కళ్యాణ్ ఏమని అర్థం చేసుకున్నారో తెలియదు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక విస్తృతార్థంలో పొలిటికల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యమివ్వాలని చెబుతుంటే.. కొందరు అధికారులు దాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏ చిన్న పనికోసం వెళ్లినా స్థానిక ఎమ్మెల్యే, నాయకులు చెబితేనే చేస్తామంటున్నారని, ప్రజల ఆస్తి వివాదాలలో కూడా తలదూర్చుతున్నారని దీనివల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తున్న ఒక ఎమ్మెల్యేని ఆయన మందలించారట. జనసేన ఎమ్మెల్యేనే అరాచకాలు చేస్తుంటే ఆయన నిరోధించలేక పోయారన్నమాట. కాని రాజకీయ పాలన అంటే చంద్రబాబు విస్తృతార్థం ఏమిటో పవన్‌కు తెలుసా?. చంద్రబాబు ఉద్దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ వారికి ఏ పని చేయకపోవడం, ఆ పార్టీ అభిమానులకు స్కీమ్‌లలో కోత పెట్టడం, సోషల్ మీడియా, సాక్షి వంటి మీడియా ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే పొలిటికల్ గవర్నెన్స్.
అలాగే.. వేల కోట్లు అప్పులు తేవడం, కాణీ, అణాలకు ఎకరాలకు ఎకరాల భూమి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం. ఆఖరుకు టీడీపీ ఆఫీసులకు తక్కువ మొత్తానికి భూమి లీజులకివ్వడం కూడా రాజకీయ పాలనే అవుతుంది. అయితే, టీడీపీ మాదిరిగానే జనసేన పార్టీకి కూడా భూములు కేటాయించాలని మంత్రి దుర్గేశ్ కోరారట. టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అక్రమ సంపాదనకు పాల్పడుతున్న విషయం పవన్‌కు తెలియదా? రాష్ట్రంలో 90 శాతం మద్యం దుకాణాలను టీడీపీ వారికే దక్కేలా చేసింది నిజమే కదా?.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. పార్టీలు, కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హులైన వారందరికీ పథకాలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌సీపీ వారికి ఏ పని చేయవద్దని బహిరంగంగానే చెప్పారు. అదేం పద్దతి? అని పవన్ అప్పుడు అడిగి ఉంటే గౌరవంగా ఉండేది. కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇవ్వడం లేదని, అధికారులపై కూడా పెత్తనం చెలాయిస్తున్నారని పలు వార్తలు వచ్చాయి. కొంతకాలం క్రితం భూముల రిజిస్ట్రేషన‍్లలో కూడా ఎమ్మెల్యేల దందా ఏంటని ఎల్లో మీడియా కూడా రాసింది. అప్పుడు తానే సంబంధిత ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. ఆ ప్రకారం సుమారు 35 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అయినా ఆ తర్వాత ఏమీ కాలేదని పవన్ వ్యాఖ్యల ద్వారా అర్దం అవుతుంది.
టీడీపీ నాయకత్వం ఆదేశాలను పట్టించుకోని వారి సంఖ్య 48కి పెరిగింది. వారికి నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు పార్టీ ఆఫీస్‌కు ఆదేశాలు ఇచ్చారట. విచిత్రం ఏమిటంటే వారు పెన్షన్ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం లేదట. అందుకే నోటీసులు ఇచ్చారట. అంతే తప్ప, భూమి, లిక్కర్, ఇతర స్కాంలలో భాగస్వాములు అవుతున్నారని కాదట. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓపెన్‌గా టీడీపీ నేతల భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం దందా, గంజాయి అమ్మకాలలో కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మనుషులు భాగస్వాములు అవుతున్నారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి చర్య తీసుకోకపోగా, వాటన్నిటిని బయటపెడతావా అంటూ కొలికపూడి పార్టీ లైన్ దాటారంటూ ఆయనను మందలించే స్థితిలో టీడీపీ ఉంది. పొలిటికల్ గవర్నెన్స్ ప్రకారం పార్టీ నాయకులు అక్రమాలు చేసినా ఫర్వాలేదు కాని, అవి బయట పడకూడదనే కదా!. మరి పవన్ కళ్యాణ్‌కు అర్థమైన విస్తృతార్థం ఏమిటో?.
ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఉపేక్షించవద్దని జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని పవన్ కోరినప్పుడు చంద్రబాబు ఏం జవాబు ఇచ్చారో తెలుసా? ఎల్లో మీడియా రాసిన దాని ప్రకారమే తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్‌చార్జీ మంత్రులదే అని చెప్పారు. అంటే ఆ రకంగా చంద్రబాబు చేతులు దులుపుకున్నారన్నమాట. దీని గురించి పవన్ ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయారు?. రాష్ట్రంలో పరిస్థితి ఎంత అరాచకంగా ఉందనే విషయం పవన్ కళ్యాణ్‌కు తెలియదా?. టీడీపీ ఎమ్మెల్యే జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న ఆరోపణలు వస్తే పవన్ కనీసం స్పందించలేకపోయారే!. శ్రీకాకుళం, తిరుపతి జిల్లాలలో ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన ఆరోపణలు వస్తే చర్య తీసుకోవాలని పవన్ కోరారా?. సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పటికీ రేషన్ మాఫియా కొనసాగుతోందని అనేక వార్తలు వస్తుంటే ఎందుకు నోరెత్తడం లేదు?.
రాష్ట్రంలో జూద కేంద్రాలు నడుస్తున్నాయని భీమవరం డీఎస్పీపై తీవ్ర ఆరోపణలను పవన్ చేస్తేనే దిక్కులేదే!. అది నిజమా? కాదా? అన్నది కూడా చెప్పలేదే!. అయితే, ఒక్కటి మాత్రం జరుగుతోంది. వ్యూహాత్మకంగా కేబినెట్ సమావేశాలలో, ఇతరత్రా వీలైనప్పుడు పవన్‌ను పొగిడేసి చంద్రబాబు ఖుషీగా ఉంచుతున్నారని అనుకోవాలి. అంతేకాక పవన్ తన పదవిని ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వెళ్లాలన్నా, మరెక్కడికి వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లతో సమానంగా ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉంటున్నాయి. అలాగే తమకు కావల్సిన వారికి వందల ఎకరాల భూమిని పందేరం చేసుకుంటున్నారు. పవన్ సన్నిహితుడైన ఒక పారిశ్రామికవేత్తకు 1200 ఎకరాల భూమి కేటాయించారని గతంలో వార్తలు వచ్చాయి.
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేయడం రాజకీయ పాలన కిందకు వస్తుందేమో తెలియదు. విశాఖలో టీడీపీ నేత గోడౌన్‌లో పెద్ద ఎత్తున గోమాంసం పట్టుబడితే కిమ్మనకపోవడం, పిఠాపురంలో కల్తీ నెయ్యి తయారవుతున్న తీరుపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగడం వంటివి జరిగినా నోరెత్తినట్లు వార్తలు రాలేదు. పొలిటికల్ గవర్నెన్స్ వల్ల లబ్ది పొందుతున్న పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో నీతులు చెబితే కుదురుతుందా?. అందుకే కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల మాటేమిటి?. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి సంగతేమిటి? అని ప్రశ్నిస్తున్నారట. మంచి పాలన ద్వారా రాజకీయంగా లబ్ది పొందడం తప్పు కాదు కాని, అచ్చంగా రాజకీయాలు చేయడమే పాలన అనుకుంటే అంతకన్నా ప్రజాద్రోహం ఉండదు. 
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


