
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విధానాలను, సంక్షేమ పథకాలపై మనసూ మార్చుకున్నారా? ‘‘యువత పాతికేళ్ల భవిత కోరుతున్నారు’’ అని ఆయన ఇటీవల చేసిన ఒక ట్వీట్ ఇందుకు కారణమవుతోంది. రాజకీయ వర్గాలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీ, జనసేనలు సంయుక్తంగా 2024 ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు, విడుదల చేసిన ప్రణాళిక, సూపర్ సిక్స్ హామీలకు ఈ వ్యాఖ్య భిన్నంగా ఉండటం గమనార్హం. 2018లో అక్టోబరు 12న పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించారు. కొందరు యువకులతో భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరిపారు.
తాజాగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ఫోటోను ట్వీట్ ద్వారా షేర్ చేశారు. ప్రతిగా పవన్ ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేసి.. ‘‘ఏపీలో యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగడం లేదని, పాతికేళ్ల భవిష్యత్తును అడుగుతున్నారు’’ అని కామెంట్ చేశారు. అందుకే తరచూ కలుస్తూ వారి (యువత) కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తున్నానని కూడా ఆ ట్వీట్‌లో చెప్పుకున్నారు. సహజంగానే ఈ ట్వీట్‌లో ఉన్న చిత్తశుద్ధి ఎంత? అన్న ప్రశ్న వస్తుంది. ఈ మధ్య కొన్ని సినిమా ఫంక్షన్లలో ఆయన ఇదే యువతను ఉద్దేశించి భిన్నమైన కామెంట్లు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. తన సినిమాలపై వ్యతిరేక కామెంట్లు చేసిన వారిపై దాడులు చేయమని యువతకు పిలుపునిచ్చారాయన. అంతేనా.. మోటార్‌సైకిళ్ల సైలెన్సర్లు తీసేసి తిరగాలని.. ఇంకా పలు రకాలుగా రెచ్చగొట్టారు. ఇవన్నీ పాతికేళ్ల భవిష్యత్తుకు మంచి చేసేవేనా?
రాజకీయాల్లో ఉన్న వారికి నిబద్ధత అన్నది చాలా ముఖ్యం. ఇలా రోజుకో రీతిలో మాట్లాడం ఎంత మాత్రం సరికాదు. ఎప్పటికప్పుడు తప్పొప్పులను దిద్దుకుంటూ యువతకు ఆదర్శంగా నిలవడం అవసరం. ఈ దిశగా పవన్ ఏమీ చేయడం లేదన్నది సుస్పష్టం. టీడీపీ ప్రతిపాదించిన సూపర్ సిక్స్ హామీలతోపాటు అప్పట్లో ఈయన గారు జనసేన తరఫున ‘షణ్ముఖ వ్యూహం’ పేరుతో కొన్ని వాగ్ధానాలు చేసిన విషయం రాష్ట్ర యువత మరచిపోయి ఉండదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం, స్టార్టప్‌లకూ ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని ఆయన షణ్ముఖ వ్యూహంలోనే ‘సౌభాగ్య పథం’ పేరుతో ప్రతిపాదించారు. ఒక్కో నియోజకవర్గానికి 500 మందికి ఇలా రూ.పది లక్షల చొప్పున ఇస్తామని కూడా చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చి 17 నెలలవుతున్నా దీని అయిపుఅజా లేదు. తాజాగా పవన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే.. ఈ పథకం ఉచితాల ఖాతాలోకి వస్తుందా? లేక నిర్మాణాత్మకమైందేనా?
ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌లు ఇద్దరూ బోలెడన్ని హామీలిచ్చారు. అప్పటి సీఎం జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలకు మించి ఇస్తామని నమ్మబలికారు కూడా. కానీ అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏది ఎలా ఎగ్గొట్టాలా? లబ్ధిదారులకు కత్తెరేయాలా? అన్న ఆలోచనలోనే ఉండిపోయారు ఒకటి, అర పథకాలను అరకొరగా అమలు చేసి మ మ అనిపించారు. ఈ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు పవన్ ఉచితాలు వద్దని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారా? అయినా కావచ్చు! 2018లోనే ఉచితాలు వద్దని పవన్ భావించి ఉంటే.. 2024 ఎన్నికల్లో అన్ని హామీలు ఎందుకిచ్చారు? పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తామన్నది ఆ ఆలవికాని హామీల్లో ఒకటి. ఒకవేల టీడీపీ ఈ హామీని ఇచ్చిందనుకుంటే.. ఉచితాలను వ్యతిరేకించే ఆలోచన ఉన్న పవన్ ఎందుకు వద్దనలేదు? నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.3000 ఇస్తామన్నది కూడా ఉచితం కాదనుకున్నారా పవన్?
అమ్మ ఒడి పథకం కింద వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, జగన్ ఆంధ్రప్రదేశ్‌లోని పేద కుటుంబాల్లోని ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇచ్చారు. అది చాలదని కుటుంబంలోని ప్రతి పిల్లాడికి రూ.18 వేలు చొప్పున ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు? ఇవే కాదు.. బీసీలకు యాభై ఏళ్లకే నెలకు రూ.నాలుగు వేల ఫించన్, ఒక్కో రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, వలంటీర్ల గౌరవ వేతనం పెంపు, కాపుల సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల వ్యయం, అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం, మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు ఆంక్షల్లేకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూడా చెప్పారు కదా? పవన్ వీటన్నింటినీ ఉచితాలు కాదని అప్పట్లో హామీ ఇచ్చారా? ఇక ఉచిత ఇసుక మాట సరేసరి.
అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం, ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం... ఇలా అనేక హామీలిచ్చారే... వీటి అమలుకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అసాధ్యమని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినా... సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని ప్రకటించారు కదా? ఇప్పుడు ఏమైంది? వృద్ధాప్య ఫించన్ల మొత్తం రూ.వెయ్యి పెంచడం, ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మినహా ఏడాదిన్నరగా అమలు చేసింది ఎన్ని హామీలు? పరిస్థితులు ఇలా ఉంటే.. పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా యువత ఉచితాలు అడగడం లేదని అనడంలో ఆంతర్యమేమిటి? హామీల ఎగవేతకు దారి వెతుకుతున్నారన్న అనుమానం బలమవుతుంది.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.