
వైఎస్సార్‌సీపీ నేతపై అనుచరులతో దాడి చేయించిన టీడీపీ నేత
పోలీసులపై నమ్మకం లేదంటూ కేసు పెట్టేందుకు నిరాకరించిన బాధితుడు
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి వీరంగం సృష్టించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్‌సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు.
బాధితుడు తెలిపిన వివరాలు.. వైఎస్సార్‌సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి చూశారు. ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్‌తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు.
జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్‌రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని దాడి వివరాలను ఆరా తీశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు లేదంటూ.. కేసు పెట్టడానికి బాధితుడు నిరాకరించారు. కాగా, నాగేశ్వరరెడ్డిని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.