
దీపావళి అనగానే నోరూరించే వివిధ రకాల మిఠాయిలు గురొస్తాయి. టపాసులు ఎంత ఫేమస్సో.. అంతే రీతిలో స్వీట్లు ఫేమస్.. పండగ శుభాకాంక్షలతో పరిశ్రమలు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వేత్తలు ప్రత్యేంగా ఆర్డర్ ఇచ్చి స్వీట్స్ తయారు చేయిస్తున్నారు. ఆది, సోమవారాల్లో నేరుగా వచ్చే వినియోగదారుల కోసం స్వీట్ దుకాణాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
సందట్లో సడేమియా అన్నట్లు డిమాండ్ ఉన్నప్పుడే నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారు. రుచి, వాసన, జిగేల్ మని మెరిసే రంగుల కోసం వివిధ రకాల రసాయనాలు వినియోగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో మిఠాయిలకు ఫుల్ డిమాండ్
కనిపిస్తోంది. పండగ రెండు రోజులు ఎగబడి మరీ కొంటారు. అయితే వీటిని తయారు చేసే సమయంలో ఎలాంటి పదార్థాలు వినియోగిస్తున్నారనేది తెలియదు. ఆహార భద్రత అధికారులు సైతం దీనిపై దృష్టిసారించే పరిస్థితి లేదు. దీంతో కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి సమయంలో మితంగా తింటే సరే.. అతిగా తిన్నామా ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
స్వీట్స్‌లో చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా వినియోగిస్తారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కొవ్వు పదార్థాలు గుండె జబ్బులకు దారితీయవచ్చు. పిల్లల్లో అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి అవసరాలకు సరిపడా పిండి వంటలను ఇంట్లోనే తయారు చేసుకుంటే మేలు. తద్వారా కల్తీ ఆహార పదార్థాలు, కలుషిత, నిల్వ ఉంచిన వాటి నుంచి జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం..
పిండి వంటల తయారీ ప్రక్రియలో నూనె, చక్కెర, రంగులు, డ్రైఫ్రూట్స్ ఎలాంటివి వినియోగిస్తున్నారో గుర్తించడం కష్టం. రుచి, వాసన, రంగు కోసం కెమికల్స్ వినియోగించే అవకాశం లేకపోలేదు. ఇవి పిల్లలు, గర్భిణులు, వృద్ధులుపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయి.
కెమికల్స్, కల్తీ పదార్థాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కావచ్చు. దీర్ఘకాలంలో కేన్సర్, లివర్, కిడ్నీపై ప్రభావం చూపిస్తాయి. ఇటువంటి వాటిపై ప్రభుత్వ శాఖాపరమైన పర్యవేక్షణ ఉండాలి. తయారు చేసిన వంటకాల ప్యాక్‌పై వినియోగించిన పదార్థాలు, ఫ్యాట్, ఇతర వివరాలు ముద్రించాలి.
– కిరణ్ కుమార్ మాదాల, ఐఎంఏ తెలంగాణ మీడియా కో–కన్వీనర్