యాంటీబయాటిక్ మందులు వేసినా కూడా సూక్ష్మజీవులు చనిపోవడానికి బదులు ఇంకా పెరుగుతూనే ఉండే పరిస్థితిని యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. దీని గురించి ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణురాలు, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరల్డ్ ఏఎంఆర్ అవగాహన వారోత్సవాన్ని (వావ్) ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా నవంబర్ 18 నుంచి 24 వరకు జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ “ఇప్పుడే స్పందించండి: మన వర్తమానాన్ని రక్షించి, భవిష్యత్తును కాపాడుకోండి’’.
ఈ థీమ్ ఏఎంఆర్‌ను ఎదుర్కొనేందుకు ధైర్యవంతమైన, సమన్వయపూర్వక, విభాగాల వ్యాప్తంగా చర్యల అవసరాన్ని చెబుతోంది. ఏఎంఆర్ అనేది ఇప్పటికే మన ఆరోగ్యం, ఆహార వ్యవస్థలు, పరిసరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న ఒక ప్రపంచవ్యాప్త ముప్పు.
యాంటీబయాటిక్స్ అనేవి ప్రాణాధార మందులు. కానీ, అవి ఇన్ఫెక్షన్ కలగజేసే సూక్ష్మజీవుల మీద పనిచేస్తేనే ప్రాణాలను కాపాడతాయి. యాంటీబయాటిక్స్ మందులు సమర్థంగా ఇన్ఫెక్షన్లను నియంత్రించలేకపోతే ప్రాణాధార చికిత్సలైన కేన్సర్ చికిత్స, అవయవ మార్పిడి లాంటి వాటిపై ఏఎంఆర్ ప్రభావం చూపుతుంది.
యాంటీబయాటిక్స్ మందులను చెప్పిన డోస్ కంటే తక్కువ కాలం వాడడం, లేదా తగిన డోసేజిలో వాడకపోవడం, ఒక వ్యాధికి సరిపడని మందు వాడడం లాంటివే వాటిని సరిగా వాడకపోవడం అవుతుంది. వైద్యులు చెప్పినట్లే వీటిని వాడాలి. మన సమస్యకు వైద్యులు యాంటీబయాటిక్స్ రాయకపోతే, అవి కావాలని వారిపై ఒత్తిడి చేయకూడదు .
వేరేవారికి రాసిన మందులు వాడితే నయమైపోతుందని అనుకోకూడదు. ఆయా వ్యక్తులు ఆరోగ్యరీత్యా తగిన మందులను సరైన డోసులోనే తీసుకోవాలి. మన దేశంలో నేరుగా దుకాణాలకు వెళ్లి ఏదిపడితే ఆ యాంటీబయాటిక్ కొనుక్కునే అవకాశం ఉండడం కూడా వీటి దుర్వినియోగానికి కారణం అవుతోంది.
కొత్త యాంటీబయాటిక్స్ తయారీ చాలా సమస్యాత్మకం, ఖర్చుతో కూడుకున్నది. మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల కొత్త యాంటీబయాటిక్స్ తగ్గుతున్నాయి. అందుకని ఉన్నవాటినే జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలావరకు టీకాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి
కాబట్టి ఏఎంఆర్ సమస్య పరిష్కారానికి పిల్లలు, పెద్దలు, వృద్ధులందరూ టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా ఇన్ఫెక్షన్ రాకపోతే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరమే ఉండదు. ఏఎంఆర్ నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషిచేయగలరు. ఈ కింది పద్ధతుల ద్వారా మీ వంతు ప్రయత్నించండి.
వైద్యులు సూచించకపోతే యాంటీబయాటిక్స్ కావాలని ఒత్తిడిచేయకండి.
మందుల దుకాణం నుంచి యాంటీబయాటిక్స్ కొనాలంటే వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే వెళ్లండి. నేరుగా వెళ్లి కొనొద్దు.
యాంటీబయాటిక్స్ వాడడానికి ఎప్పుడూ వైద్యుల సలహా పాటించండి. వాడాల్సినంత కాలం వాడాలి తప్ప మధ్యలో ఆపకూడదు.
మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ వాడద్దు, ఎవరికీ ఇవ్వద్దు.
రోజూ చేతులు కడుక్కోవడం, ఆహారాన్ని శుభ్రంగా వండడం, అనారోగ్య బాధితులకు దగ్గరగా ఉండకపోవడం, దగ్గువచ్చినప్పుడు నోరు చేత్తో మూసుకోవడం, ఎప్పటికప్పుడు టీకాలు వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను నియంత్రించండి.
చదవండి: లోపం ఐరన్.. అదే సైరన్..
వైద్యులు సరైన యాంటీబయాటిక్, సరైన డోసులో, సరైన కాలం పాటు, సరైన సమయంలో ఇవ్వాలి. వీలైనంత తక్కువకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడడమే సరైన వ్యూహం. ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స చేయడం వల్ల యాంటీబయాటిక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రాదు.

- డాక్టర్ ఆర్సీ బిలోరియా


