మానవులకు దైవభీతి, గురుభక్తి, ధర్మదీక్ష, పుణ్య కార్యాచరణం, జితేంద్రియత్వం, బ్రహ్మజ్ఞానం మొదలైన సుగుణాలను కలిగించడానికి అనేక రూపాలలో అనేక స్థలాలలో అవతరించిన త్రిమూర్తి స్వరూపుడే దత్తాత్రేయుడు. కలియుగంలో మొదట శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించి కురువపురంలో నివసించారు. ఆ తర్వాత ఆయనే శ్రీ నరసింహ సరస్వతీ యతీంద్రులుగానూ, అక్కల్‌కోట మహరాజ్‌గానూ, శ్రీ షిరిడీ సాయి నాథుడిగానూ అవతరించారని ప్రతీతి. నేడు (డిసెంబర్ 4) మార్గశిరపూర్ణిమ, దత్తజయంతి (dattatreya jayanti) సందర్భంగా ఈ వ్యాస కుసుమం ...
జన్మసంసార బంధనాలను సులువుగా వదిలించి, జ్ఞానానందాన్ని పంచుతూ, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వేరుకారని నిరూపించిన అపురూప ఘట్టమే దత్తాత్రేయ ఆవిర్భావం. త్రిమూర్తులే తనకు పుత్రులుగా జన్మించాలంటూ అత్రిమహర్షి–అనసూయ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దూర్వాసుడు (Durvasa) జన్మించగా, విష్ణు అంశతో అవతరించినవాడే దత్తాత్రేయుడు!
సకల విద్యాపారంగతుడైన దత్తుడు జ్ఞానసముపార్జనలో ప్రకృతి అణువణువూ తనకు గురువేనని వెల్లడించాడు. ధర్మబద్ధంగా ఇహలోక సుఖాలను కోరుకునేవారికి వాటిని అనుగ్రహిస్తూ, వారిని యోగమార్గంవైపు పయనింపజేసే విశ్వగురు దత్తాత్రేయడు. ఆయన అనుగ్రహిస్తే గురువుతోబాటుగా దైవానుగ్రహమూ లభించినట్లే!
ముగ్గురు మూర్తులూ మూడు శిరస్సులుగా...
దిక్కులనే అంబరంగా చేసుకుని, భక్తులను ఉద్ధరించేందుకు అనేక రూపాలను ధరించిన దత్తాత్రేయుడి మూడు తలలలో నడిమి శిరస్సు విష్ణువుది కాగా.. కుడివైపున శివుడు సద్గురు స్వరూపంగా, ఎడమవైపు బ్రహ్మదేవుడు పరబ్రహ్మస్వరూపమైన శిరస్సుతో భాసిస్తారు. మధ్యభాగంలో అజ్ఞానాన్ని తొలగించే గురుమూర్తిగా శ్రీదత్తుడు ముల్లోకాలను రక్షిస్తాడు.
దత్తావధూత
దేహంపై వ్యామోహాన్ని వదిలి, జడ పదార్థంలా ఉండేవారిని అవధూత అంటారు. ఈ పదానికి అసలైన నిర్వచనంగా మారి దత్తావధూత అయ్యాడు. బౌద్ధమతకర్త అయిన బుద్ధుడు, జైనమత స్థాపకుడైన మహావీరుడు వారి శిష్యులైన మహాయోగులు, బోధిసత్వులు, జైనతీర్థంకరులు, షిరిడీ సాయిబాబా వంటి మహనీయులందరూ దత్తాత్రేయుని అంశావతారాలే అవుతారు.
పేర్లు వేరైనా పదార్థం ఒక్కటే!
ఒక వస్తువును వివిధ భాషలవారు వివిధ పేర్లతో పిలుస్తారు. తెలుగులో మామిడిపండంటే ఆంగ్లంలో ‘మ్యాంగో’ అంటారు. హిందీలో ఆమ్ అంటే సంస్కృతంలో చూతఫలం అంటారు. ఇంకా ఇతర భాషల్లో వేరే పేర్లతో పిలుస్తారు. పేర్లెన్ని ఉన్నా పదార్థం ఒక్కటే కదా! ఆవిరిగా మారినా, మంచులా గడ్డకట్టినా, నీరుగా ఉన్నా అది ఉదకమే కదా! కాబట్టి ఆయన భక్తులకోసం తానే అనేక రూపాలు ధరించి, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతూ, ఆదుకుంటూ ఉంటాడు.
అరుదైన రూపం
రుద్రాక్షమాల, డమరుకం, చక్రం, శంఖం, త్రిశూలం, కమండలాదులను ఆరుచేతులలో ధరించిన దత్తుని చుట్టూ ఉన్న నాలుగు శునకాలు వేదాలకు ప్రతీకలు. తనను ఆశ్రయించిన వారిని నాలుగువైపులనుండి రక్షిస్తాననే సందేశం కూడా ఇందులో ఉంది. ఆయన వెనకాల కనిపించే గోవును ఉపనిషత్తుల సారంగా చెబుతారు.
దత్తజయంతి నాడు ఏమి చేయాలి?
అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో మార్గశీర్ష శుద్ధ పౌర్ణమినాడు జన్మించాడు దత్తాత్రేయుడు. ఈ పర్వదినాన ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం శుచిౖయె దత్తాత్రేయులవారి చిత్రాన్ని లేదా ప్రతిమను ముందు ఉంచుకుని షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. శారీరక ఉపవాసం కన్నా మానసికంగా చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండటమే ఆయనకు ఇష్టం.
అనంతరం దత్తచరిత్ర, దత్తసహస్రనామావళి, శ్రీగురుచరిత్ర (Shri Guru Charitra) వంటి గ్రంథాలను పారాయణ చేయడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మానసిక, శారీరక వైకల్యాలున్నవారు మార్గశిర పూర్ణిమనాడు దత్తాత్రేయుణ్ణి షోడశోపచారాలతో పూజించి, పంచామృతాలతో అభిషేకిస్తే వారి వైకల్యాలన్నీ తొలగి ఆరోగ్యవంతులవుతారని దత్తచరితం చెబుతోంది.
చదవండి: ప్రశాంత జీవన రహస్యమే గీతాసారం
దత్తుడు ఉదయించిన మార్గశిర పౌర్ణమినే (Margashirsha Purnima) దత్తజయంతిగా జరుపుకుంటారు. ‘దిగంబరా దిగంబరా శ్రీ ΄ాదవల్లభ దిగంబరా’ అంటూ దత్తనామ స్మరణలో గడుపుతారు. దత్తచరిత్ర, అవధూత గీత మొదలైన గ్రంథాల్ని పారాయణ చేస్తారు. భజనలు, సత్సంగాలు నిర్వహిస్తారు. నేడు దత్త స్తవం లేదా దత్తాత్రేయ వజ్రకవచం పఠించడం వలన అన్నిరకాల రక్షణ లభిస్తుంది. దత్తుడి ఆరాధన ఎంతో జటిలమైన పితృదోషాలను సైతం తొలగిస్తుందని ప్రతీతి. అందరికీ ఆ దత్తుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం. జై గురు దేవదత్త
– డి.వి.ఆర్.భాస్కర్


