
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం రోజున పలు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. నేషనల్ స్టేడియంలో ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నివాళి అర్పించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్పోర్ట్స్ బిల్ వల్ల మన క్రీడారంగం దశ, దిశ మారిపోతాయని... భవిష్యత్తులో అత్యుత్తమ క్రీడా వేదికగా భారత్ నిలుస్తుందని మాండవీయ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని మన దేశంలోని క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన మోండో అథ్లెటిక్ ట్రాక్‌ను మంత్రి ప్రారంభించారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో, అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ఈ ట్రాక్‌లో సెప్టెంబర్ 26 నుంచి వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి, మాజీ అథ్లెట్ అంజూ బాబీజార్జ్‌తో పాటు పలువురు క్రీడాకారులు, క్రీడాధికారులు కలిసి సరదాగా మైదానంలో పలు ఆటలు ఆడి సంబరాలు చేసుకున్నారు.
మరోవైపు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు అథ్లెట్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశంలో ఆటగాళ్ల ఘనతలు గుర్తు చేస్తూ వారిపై ప్రత్యేక ప్రశంసలు కురిపించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా... యువ క్రీడాకారులు ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో అగ్రస్థాయికి చేరాలని ఆకాంక్షించారు.