క్రీడా పరిపాలకుల్లో అంతా అర్హతలేనివారే
సమన్వయ జాతీయ మండలి అవసరం
క్రీడాశాఖకు బింద్రా నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ నివేదిక
న్యూఢిల్లీ: క్రీడల్లో విజేతల్ని చూడాలంటే ఇప్పుడున్న క్రీడా వ్యవస్థని సమూలంగా మార్చాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ సూచించింది. మాజీ ఒలింపిక్ చాంపియన్ అభినవ్ బింద్రా నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్ మంగళవారం క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు తుది నివేదికను సమర్పించింది. 170 పేజీల నివేదికలో పలు కీలకమైన సిఫార్సులతో పాటు వేళ్లూనుకుపోయిన వ్యవస్థీకృత లోటుపాట్లను టాస్క్ఫోర్స్ ఎండగట్టింది.
రాష్ట్ర క్రీడా సంఘాలు, జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లన్నీ సంస్థాగత లోపాలతో మునిగిపోయాయని, క్రీడా పరిపాలకుల్లో సరైన అథ్లెట్లే లేరని టాస్‌్కఫోర్స్ ఎత్తి చూపింది. ఉన్నా ఒకరిద్దరిలో అర్హతలు, సమర్థత లేనివారేనని గుర్తించింది. ప్రస్తుత క్రీడా వ్యవస్థపై టాస్క్‌ఫోర్స్ లోతుగా అధ్యయనం చేసింది.
ఏదో అరకొరగా, ఒకరిద్దరితో తమ భేటీని ముగించలేదని... అథ్లెట్లు, ప్రభుత్వ అధికారులు, ‘సాయ్’ వర్గాలు, రాష్ట్ర, కేంద్ర క్రీడా సంఘాలు, సమాఖ్యలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు, అంతర్జాతీయ సంస్థలతోనూ టాస్‌్కఫోర్స్ చర్చించింది.
అంతర్జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ప్యానెల్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మాజీ అధ్యక్షుడు థామస్ బాచ్ (మాజీ ఒలింపిక్ ఫెన్సింగ్ చాంపియన్), ప్రస్తుత అధ్యక్షుడు కిర్‌స్టీ కొవెంట్రీ (మాజీ ఒలింపిక్ చాంపియన్), ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) చీఫ్ సెబాస్టియన్ కొ (మాజీ ఒలింపిక్ మిడిల్‌డిస్టెన్స్ రన్నింగ్ చాంపియన్)లతో చర్చించింది.
» రాష్ట్ర సంఘాలు, జాతీయ సమాఖ్యలు, స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడానికి, ముఖ్యంగా క్రీడా శిక్షణకు, క్రీడా పరిపాలన నియంత్రణకు జాతీయ స్థాయిలో సమన్వయ మండలి అవసరమని బింద్రా కమిటీ సూచించింది. ఇందుకోసం కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జాతీయ క్రీడా శిక్షణ–సమర్థ నిర్వహణ మండలి (ఎన్‌సీఎస్‌ఈసీబీ) ఏర్పాటు చేయాలని అందులో పేర్కొంది.
» ప్రస్తుత క్రీడా పాలనలో గుణాత్మక మార్పు రావాలని, సుప్తావస్థని రూపుమాపేలా కొన్ని కఠినమైన నిర్ణయాలు, నిర్మాణాత్మక సిఫార్సుల్ని బింద్రా టాస్‌్కఫోర్స్ సూచించింది.
» ‘సాయ్’కి గానీ, రాష్ట్ర క్రీడాశాఖల్లో గానీ నిబద్ధత, సమర్థత కలిగిన కార్యాలయ సిబ్బందే లేదు. సాధారణ అధికారులు లేదంటే కాంట్రాక్టు సిబ్బందితో ఆయా పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఇది తూతూ మంత్రంగా పనులు చక్కబెడుతోంది. తద్వారా పాలక వ్యవస్థనే నీరుగారుస్తోంది.
» క్రీడా పాలనలో అథ్లెట్లకు సరైన మార్గ నిర్దేశనమే లేదు. ఉదాహరణకు జాతీయ క్రీడా పాలసీ ప్రకారం క్రీడా సమాఖ్య కార్యవర్గాల్లో అథ్లెట్లను తప్పనిసరి చేసినప్పటికీ ఆయా అథ్లెట్లు కార్యనిర్వహణలో రాణించేలా ఎలాంటి శిక్షణ వ్యవస్థ లేదు.
» దేశంలో ఇప్పటికీ క్రీడాకారుల వృద్ధి కోసం దీర్ఘకాలిక అభివృద్ధి మండలిలాంటిది ఏదీ లేదు. ఇదే ఉంటే విద్య, అథ్లెట్ కెరీర్‌కు సంబంధించి సంయుక్త ప్రణాళిక, కెరీర్ ఓరియంటేషన్ కార్యక్రమం సరైన మార్గంలో సాగేది.


