లక్షన్నర జనాభా గల కురసావ్ దేశం ప్రపంచకప్‌కు అర్హత సాధించగా...
143 కోట్ల జనాభా ఉన్న భారత్ పరిస్థితి ఏంటి!
రాజ్యసభలో ఆసక్తికర చర్చ
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టుపై గురువారం రాజ్యసభలో ఆసక్తికరచర్చ జరిగింది. 1 లక్షా 58 వేల జనాభా మాత్రమే ఉన్న కురసావ్ దేశం జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించింది. అయితే 143 కోట్ల జనభా ఉన్న భారత్ సంగతేంటని కేరళకు చెందిన కాంగ్రెస్ సభ్యులు జోస్ కె. మణి రాజ్యసభలో ప్రశ్నించారు. మన ఫుట్‌బాల్ జట్టు ప్రగతిపై దీర్ఘకాలిక ప్రణాళికలేవైనా ఉన్నాయా అని కూడా అడిగారు. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పందిస్తూ కురసావ్ దేశం పేరెత్తకుండా బదులిచ్చారు.
‘ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించడం అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిర్దేశించిన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది’ అని అన్నారు. ఏదైనా ప్రపంచకప్ లేదంటే ప్రపంచ చాంపియన్íÙప్‌లలో పాల్గొనడానికి, అర్హత సంపాదించడానికి సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్య చూసుకోవాల్సిన అంశమని, ఆయా క్రీడల నిర్దిష్ట అభివృద్ధికి సంబంధిత సమాఖ్యలదే బాధ్యతని ఆయన సభకు వివరించారు.
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) దేశంలో క్రీడాభివృద్ధికి, ఆదరణ పెంచేందుకు, ప్రతిభగల ఫుట్‌బాలర్లను మరింత సానబెట్టేందుకు, పురుషులు, మహిళల జట్టు ‘ఫిఫా’ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తాయని మంత్రి మాండవీయ వివరించారు.
తమ ప్రభుత్వ పరంగా ‘ఖేలో ఇండియా’ పేరుతో చేపట్టిన బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన అథ్లెట్లు ఎందరో వెలుగులోకి వచ్చారని, 20 వేల పైచిలుకు క్రీడాకారులు ఈ ఖేలో ఇండియాతో ప్రయోజనం పొందారని చర్చ సందర్భంగా జవాబిచ్చారు. దేశంలో ఉన్న 991 ఖేలో ఇండియా కేంద్రాల్లో 28,214 మంది క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని చెప్పారు.


