అదే బాటలో స్విగ్గీ, జెప్టో
న్యూఢిల్లీ: డెలివరీ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతోందన్న ఆందోళనల నడుమ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ ’10 నిమిషాల్లో డెలివరీ’ నినాదాన్ని పక్కన పెట్టింది. జెప్టో, ఇన్‌స్టామార్ట్‌లాంటి మిగతా సంస్థలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలివరీ అగ్రిగేటర్ సంస్థలతో గత వారం భేటీ అయిన కేంద్ర కార్మీక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇచ్చిన సూచనల మేరకు కంపెనీలు ’10 మినిట్’ డెలివరీ డెడ్‌లైన్‌ని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మాండవీయ సారథ్యంలో జరిగిన సమావేశంలో బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీలాంటి దిగ్గజాలు పాల్గొన్నాయి.
బ్లికింగ్ట్ సత్వరం ఆదేశాలను అమలు చేస్తూ తమ బ్రాండింగ్ నుంచి 10 నిమిషాల్లో డెలివరీ హామీని తొలగించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికి తగ్గట్లుగా కంపెనీ తన బ్రాండ్ మెసేజింగ్‌ని కూడా అప్‌డేట్ చేసింది. ‘10 నిమిషాల్లో 10,000 పైగా ఉత్పత్తుల డెలివరీ‘ హామీని ‘మీ ఇంటి ముంగిట్లోకే 30,000కు పైగా ఉత్పత్తుల డెలివర్ అవుతాయి‘ అని మార్చింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని, 10 మినిట్స్ ఇన్‌స్టంట్ డెలివరీ సిస్టమ్‌కు స్వస్తి పలకడాన్ని గిగ్, ప్లాట్‌ఫాం సర్విస్ వర్కర్ల యూనియన్ స్వాగతించింది. 10 నిమిషాల డెలివరీని వ్యతిరేకిస్తూ గిగ్ వర్కర్లు నూతన సంవత్సరం రోజున దేశీయంగా సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే.


