
వ్యవసాయ రంగానికి సేవలందించినవారికి కూడా..
అందుకోసం వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసే యోచన
వచ్చే వైఎస్సార్ వర్ధంతి నాటికి ఫౌండేషన్ ఏర్పాటు
డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
దివంగత సీఎంను స్మరించుకున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పేరుతో అభ్యుదయ రైతులు, వ్యవసాయ రంగానికి విశేష సేవలందించినవారికి అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అందులో భాగంగా వైఎస్సార్ పేరిట ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీసెంటర్ చౌరస్తా, పంజగుట్ట కూడలిలోని వైఎస్సార్ విగ్రహాలకు మంగళవారం భట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయాచోట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే వైఎస్సార్ వర్ధంతి నాటికి ఫౌండేషన్‌కు రూపకల్పన చేసి వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిన వారిని గుర్తించి వైఎస్సార్ పేరిట అవార్డులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌ను నిత్యం స్మరిస్తూ, వారి ఆలోచనను ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ అంటే మొదట గుర్తుకువచ్చేది వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్టులేనని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణించి 15 ఏళ్లు అవుతున్నా ఆయన గుర్తులు ప్రతి ఇంట్లో చిరస్మరణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.
నేటితరం యువత, రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వైఎస్సార్ నుంచి ఎంతో నేర్చుకోవాలన్నారు. పంజగుట్ట కూడలిలో జరిగిన కార్యక్రమంలో భట్టితోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ టీపీసీసీ ఆధ్వర్యంలో ఘన నివాళులు
వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గాం«దీ భవన్‌లో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. అనంతరం పేదలకు వ్రస్తాలు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నారాయణస్వామి, మహేశ్‌కుమార్‌గౌడ్, దానం, శ్రీగణేశ్, బల్మూరి, అద్దంకి దయాకర్, మధుయాష్కీ గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, కేవీపీ పాల్గొన్నారు.