
న్యూఢిల్లీ: మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 7వ తేదీ (మంగళవారం)న దేశంలోని పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. వాల్మీకి జయంతి నాడు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లతో సహా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. అక్టోబర్ 7వ తేదీన అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా రాజధాని అంతటా పలు కార్యక్రమాలు, ఊరేగింపులు, నివాళి సమావేశాలు నిర్వహించనున్నారు. వీటిలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొననున్నారు. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు అక్టోబర్ 7న మూసివేయనున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అంతటా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 7న రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో రామాయణ పారాయణం జరుగుతుందని సీఎం తెలిపారు.
ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసంలోని పౌర్ణమినాడు మహర్షి వాల్మీకి జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం మహర్షి వాల్మీకి మహర్షి కశ్యపుడు, అదితి దంపతుల తొమ్మిదవ కుమారుడు. మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనుక ఒక పురాణగాథ ఉంది. వాల్మీకి తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయినప్పుడు, చెదపురుగులు అతని శరీరం చుట్టూ చేరి, పుట్టలను కట్టాయి. సంస్కృతంలో చెదపురుగుల పుట్టలను వాల్మీకి అని పిలుస్తారు. అందుకే నాటి నుంచి ఆ మహర్షి పేరు వాల్మీకి అయ్యింది. రామాయణ గాథ ప్రకారం శ్రీరాముడు.. సీతామాతను విడిచిపెట్టిన తర్వాత, ఆమె మహర్షి వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. శ్రీరాముని కుమారులైన లవ కుశులకు విద్యను అందించిన ఘనత కూడా వాల్మీకికే దక్కుతుంది.