అభివృద్ధిపథం వైపు దూసుకెళ్లిన తల్లెంవారిపల్లె
అధునాతన సౌకర్యాలతో హైస్కూల్ ఏర్పాటు
సచివాలయం, విద్యుత్ సబ్‌స్టేషన్, రహదారుల నిర్మాణం
ఇదంతా వైఎస్ జగన్ పాలన వల్లేనని గ్రామస్తుల కితాబు
ఇలా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల రూపురేఖలు మార్చిన వైఎస్ జగన్
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల పంచాయతీ పరిధిలోని తల్లెంవారిపల్లె అటవీ శివారు గ్రామం. 500 ఇళ్లున్న ఈ గ్రామం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చే దాకా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వ భవనం అంటూ ఒక్కటీ ఉండేది కాదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఆ ఊరు రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. అభివృద్ధి పనులు పరుగులు తీశాయి. గ్రామంలోకి అడుగు పెట్టగానే గ్రామ సచివాలయ భవనం అందంగా కనిపిస్తుంది.
దానికి కొంచెం దూరంలో సకల సౌకర్యాలతో నాడు–నేడు కింద కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా హైస్కూల్ ఏర్పాటు అయ్యింది. నగరాలు, పట్టణాల్లో ఉండే స్కూళ్లను మరిపిస్తూ రూపు దిద్దుకున్న ఈ స్కూల్లో ఇప్పుడు తల్లెంవారిపల్లెతో పాటు గాదెల పంచాయతీలోని ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, అరుంధతివాడ, కొత్తపల్లి అరుంధతివాడ, కొత్తపల్లి దళితవాడలతో పాటు జీవీ పురం, నూకనపల్లె, కిష్టంపల్లె గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు.

పాములేరు వంకపై పాఠశాల రక్షణ గోడ సైతం నిర్మించారు. అన్నదాతలను అన్ని విషయాల్లో చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం వెలిసింది. చుట్టుపక్క గ్రామాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటైంది. తల్లెంవారిపల్లె–కొత్తపల్లె, జీవీపురం–తల్లెంవారిపల్లె గ్రామాలకు సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఇలా తక్కువ సమయంలో గ్రామం అభివృద్ధిపథంలో దూసుకెళ్లింది. ఎంతలో ఎంత మార్పు.. అని గ్రామస్తులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. – ఓబులవారిపల్లె


