గణతంత్ర దినోత్సవ వేడుకలకు యావద్దేశం సిద్ధమవుతున్న వేళ అహ్మదాబాద్, నోయిడాలలోని పలు ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఆ ప్రాంతాలలో తీవ్రకలకలం రేపింది. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన భద్రత బలగాలు వెంటనే అక్కడికి చేరుకొని తనిఖీలు చేపడుతున్నాయి.
శుక్రవారం ఉదయం గుజరాత్‌లోని పలు ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్లలో పేలుడు పదార్థాలు పెట్టామంటూ ఫోన్‌లతో పాటు మెయిల్స్ రావడంతో స్కూల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పిల్లలతో పాటు సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ బృందాలతో గాలింపులు చేపడుతున్నారు. అదేవిధంగా ఇదే తరహా బాంబు బెదిరింపు నోయిడాలోని శివనాడర్ పాఠశాలకు వచ్చింది. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన పిల్లలను వారి ఇండ్లకు తరలించారు. బాంబ్‌స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకొని సోదాలు జరుపుతున్నాయి.
అయితే గతేడాది ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడుల నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అనంతరం జరిపిన విచారణలో ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు తెలిసింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.


