
మన సంస్కృతిలో భాగంగా కలిసిపోయినప్పటికీ టీ జన్మస్థలం భారత దేశం కాదు ఈ పానీయంపై చైనా గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 19వ శతాబ్దంలో పెద్ద ఎత్తున టీ సాగును ప్రవేశపెట్టింది. మొదట్లో, భారతీయులను అది లక్ష్యం చేసుకోలేదు. టీ ఎగుమతి ఇతర ప్రముఖ సంపన్న దేశాలకు ఉండేది. కానీ అనూహ్యంగా భారతీయులు ఆ విదేశీ అలవాటును తమ స్వంతం చేసుకున్నారు.
అయితే 1900లలో బ్రిటిష్ కంపెనీలు స్థానికంగా టీని ప్రోత్సహించడం ప్రారంభించినప్పుడు, దానిని మరింత రుచికరంగా మార్చడానికి పాలు చక్కెరను జోడించమని వారే మనవాళ్లని ప్రోత్సహించారు. ఈ ఆలోచన వారు ఊహించిన దానికంటే బాగా పనిచేసింది. భారతీయులు ఆ పానీయాన్ని స్వీకరించడమే కాదు, దానిని తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు.
కలిసి...కరిగిపోయి...
భారతీయ వంటశాలలలో పాలు అంటే ఒక పదార్ధం కంటే ఎక్కువ ఇది పోషణ, స్వచ్ఛత సంప్రదాయం. బాల్యంలో హల్దీ దూద్ గ్లాసుల నుంచి పండుగ స్వీట్ల వరకు, పాలు అనేక రకాలుగా భారతీయుల్ని వారి అభిరుచుల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. కాబట్టి అది మనం తాగే టీలో కూడా సులభంగా, వేగంగా కలిసిపోయింది.
భారతదేశంలోని చిన్న పట్టణాలు మార్కెట్లలో టీ వ్యాపించడంతో, ప్రతి ప్రాంతం దాని స్వంత రుచులను దానికి జోడించింది.ఆ తర్వాత మసాలా చాయ్ వచ్చింది. వెచ్చదనం కోసం అల్లం, సువాసన కోసం ఏలకులు, కిక్ కోసం లవంగం, గాఢత కోసం దాల్చిన చెక్క... పాల తర్వాత టీలో కలిపే జాబితా లో చేరిపోయాయి.
చాయ్...రాజా చాయ్...
20వ శతాబ్దం మధ్య నాటికి, చాయ్‌వాలా రైల్వే ప్లాట్‌ఫామ్‌లు వీధి మూలలను ఆక్రమించి, ప్రయాణికులకు కార్మికులకు ఆవిరితో కూడిన పాల టీ గ్లాసులను అందించారు. వలసరాజ్యాల ఎగుమతిగా ప్రారంభమైన ఈ పానీయం రోజువారీ అలవాటుగా ఎన్ని విధాలుగా అయినా మార్పు చేర్పులకు అనుకూలించేదిగా మారింది.
భాష, కులం వంటకాల ద్వారా వ్యత్యాసాలున్న మన దేశంలో, టీ ఒక విధంగా ఉమ్మడి అభిరుచిని నిర్మించింది. ఇద్దరు అపరిచితులు ఒక మాటను పంచుకోకపోవచ్చు, కానీ పంచుకున్న కప్పు చాయ్ ఎంతటి దూరాన్ని అయినా కరిగించగలదు అన్నంతగా ప్రభావాన్ని చూపుతోంది.
మరికొన్ని దేశాలకూ విస్తరించిన మిల్క్ టీ...
భారతదేశం వెలుపల, టీ వేరే రూపాల్లో సంచరిస్తోంది. టీ పుట్టిన చైనా జపాన్‌లలో తేనీటి స్వచ్ఛతకు విలువ ఇస్తారు. వారి దృష్టి ఆకుపై, దాని వాసనపై మాత్రమే ఉంటుంది. వారు పాలు కలపరు. బ్రిటిష్ వారు కూడా పాలు అతి తక్కువగానే కలుపుతారు.
మన దేశం కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, తైవాన్ థాయిలాండ్ వంటి దేశాలలోనూ పాలతో టీ అనే అలవాటు ఉన్నప్పటికీ మన దేశంతో పోటీపడే స్థాయిలో కాదు. మంగోలియా, ఇథియోపియా, బురుండి, కెన్యా ఆఫ్రికాలోని అనేక ఇతర దేశాలు ముఖ్యమైన మిల్క్ టీ సంప్రదాయాలు ఉన్నాయి.