విదేశాలలో తీసుకున్న డివోర్స్‌ భారత్‌లో చెల్లుతుందా..? | Law Advice: Is Your Foreign Divorce Valid in India | Sakshi
Sakshi News home page

విదేశాలలో తీసుకున్న డివోర్స్‌ భారత్‌లో చెల్లుతుందా..?

Dec 3 2025 8:46 AM | Updated on Dec 3 2025 8:55 AM

Law Advice: Is Your Foreign Divorce Valid in India

నేను గత 8 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. ఇక్కడే కలిసిన ఒక అమ్మాయిని ఇండియాకు వచ్చి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాను. కోవిడ్‌ సమయంలో నాకు–తనకు మనస్పర్ధలు రావడంతో ఒక సంవత్సరం ప్రయత్నం చేసి విడిపోవాలి అనుకున్నాము. అయితే ఈలోగా తను అమెరికాలోనే డివోర్స్‌ కోసం దాఖలు చేసుకుంది. నేను కూడా నా వాదనలు వినిపించాను, డివోర్స్‌కు అంగీకరించాను. అమెరికా కోర్టు డివోర్స్‌ మంజూరు చేసింది. అందులో భాగంగానే మాకు ఉన్న ఆస్తులను, అప్పులను కూడా అమెరికా కోర్టు పంచి ఇచ్చింది. అదే సమయంలో నేను ఇండియాలోని ఒక లాయర్‌ను సంప్రదించగా అమెరికా డివోర్స్‌ భారతదేశంలో చెల్లవు అని హైదరాబాదులో కూడా 13(1)కింద డివోర్స్‌కు పిటిషన్‌ వేయించారు. నేను పిటిషన్‌ వేసిన తర్వాత అమెరికాలో డివోర్స్‌ వచ్చింది. ఇప్పుడు నా మాజీ భార్య మరలా హైదరాబాద్‌ కోర్టు ముందుకు వచ్చి (జీపీఏ ద్వారా) నా డివోర్స్‌ పిటిషన్‌ కొట్టి వేయాలని కోరుతూ, భారీగా భరణం కూడా డిమాండ్‌ చేస్తోంది. అంతేకాక, ఒకపక్క డివోర్స్‌ వేసి మరోపక్క నా మీద, నా కుటుంబం మీద క్రిమినల్‌ కేసులు కూడా పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడు మేము విడిపోయినట్లేనా? లేక ఇంకా డివోర్స్‌ తీసుకోవాలా? దయచేసి వివరించగలరు. 
– మద్దెల శేఖర్, హైదరాబాద్‌

మీ కేసు వివరాలు బాధాకరంగా ఉన్నాయి. విదేశాలలో తీసుకున్న డివోర్స్‌ కానీ, మరేదైనా కోర్టు తీర్పు గాని భారతదేశంలో చెల్లుతుందా లేదా అనే విషయాన్ని సివిల్‌ కోడ్‌ లోని సెక్షన్‌ 13 నిర్ణయిస్తుంది. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఆవిడే డివోర్స్‌ కేసు వేసి, గృహహింస ఆరోపణలు చేసి, అందులో మీరు పాల్గొన్నాక అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి, ఆ తీర్పు భారతదేశంలో ఖచ్చితంగా చెల్లుతుంది. 

ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఎన్నో హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాలలో ఫారిన్‌ డివోర్స్‌ ఆర్డర్లు ఇండియాలో ఏ పరిణామాలలో చెల్లుతాయో, ఎటువంటి పరిణామాలలో చెల్లవో వివరిస్తూ చాలా సుదీర్ఘమైన జడ్జిమెంట్లను ఇచ్చాయి. నిజానికి మీరు ఇండియాలో మరొకసారి డివోర్స్‌ కేసు వేయవలసిన అవసరం కూడా లేదు. కేవలం అమెరికా డివోర్స్‌ను ధ్రువీకరించుకోవడానికి భారతదేశ కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసుకుంటే సరిపోతుంది. అక్కడ డివోర్స్‌ తీసుకుని మరీ ఇక్కడ మీరు వేసిన డివోర్స్‌ డిస్మిస్‌ చేయాలి అనే తన ధోరణిని కోర్టు సమర్థించదు. 

ఇప్పటికయినా మించిపోయింది లేదు. సరైన న్యాయ సలహా తీసుకొని (అవసరమైతే మీరు వేసిన డివోర్స్‌ విత్‌ డ్రా చేసుకొని మరీ) ఫారిన్‌ డివోర్స్‌ ఆర్డరు ధ్రువీకరణకు పిటిషన్‌ దాఖలు చేసుకోండి. మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద పెట్టిన క్రిమినల్‌ కేసులు కూడా కోర్టు కొట్టేసే ఆస్కారాలే ఎక్కువ! ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే హైకోర్టును కూడా మీరు ఆశ్రయించవచ్చు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత మాత్రమే ఎలాంటి చర్య తీసుకోవాలనేదీ అర్థమవుతుంది కనుక, పత్రాలు అన్నీ తీసుకుని ఎవరైనా నిపుణులైన అడ్వొకేట్‌ను కలిస్తే మంచిది. 
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  )

(చదవండి: జేఈఈ ప్రిపరేషన్‌ నుంచి రాష్ట్రపతి మెడల్‌ వరకు..! ఎన్డీఏ చరిత్రలో సరికొత్త మైలు రాయి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement