కొన్ని విజయగాథలు ఎలా ఉంటాయంటే చక్రవర్తుల గెలుపులు కూడా దాని ముందు వెలవెలబోతాయి. చైనా అమ్మాయి లియాంగ్ యీ జీవితం వీల్‌చైర్‌కే పరిమితం. అయినా సరే రెండు చక్రాలు కదిలితేనే తన జీవితం కదిలేలా ఉండకూడదు అనుకుంది. ప్రయత్నించింది. పోరాడింది. నేను నాలానే ఉంటూ యాంకర్ అవగలను అని నమ్మి ప్రపంచాన్ని ఒప్పించింది. చైనా మొదటి వీల్‌చైర్ యాంకర్ లియాంగ్ స్ఫూర్తి గాథ నేడు ప్రత్యేకం.
పట్టు పట్టనేకూడదు. పడితే విడవనూ కూడదు. అంతరాయాల అడ్డుగోడలను బద్దలుకొట్టి ముందుకు సాగడమే పని. లియాంగ్‌ను చూడండి. తను టీవీలో యాంకర్‌గా పని చేయాలనుకుంది. యాంకరే అయింది. అయితే ఆమెను విధి వీల్‌చైర్‌కు పరిమితం చేసింది. అయినా సరే మళ్లీ యాంకరే అయ్యింది. కాకపోతే ఈసారి వీల్‌చైర్ యాంకర్. గ్లామర్ రంగంలో వీల్‌చైర్‌తో ముందుకు వచ్చి స్క్రీన్ మీద కనపడి ఒప్పించడానికి చాలా స్థయిర్యం ఉండాలి. ఆ స్థయిర్యంతోనే చైనాలో ఫస్ట్ వీల్‌చైర్ యాంకర్‌గా గౌరవం పొందుతోంది లియాంగ్.
ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే..
చైనాలోని హునాన్‌లో జన్మించిన లియాంగ్‌కు ఒకటే కోరిక. టీవీ వ్యాఖ్యాతగా మారాలి అని. ఆ విధంగానే చదువు పూర్తి చేసి చైనాలో ప్రసిద్ధి చెందిన ‘హ్యూమన్ టీవీ’లో యాంకర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. చలాకీతనం, చక్కని చిరునవ్వు కలగలిసిన ఆమె యాంకరింగ్ అందర్నీ ఆకట్టుకుని ఈ రంగంలో ఆమె రాణిస్తుందని భావించేలా చేసింది. కానీ నాలుగు నెలల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఓ ్రపోగ్రామ్‌కి సిద్ధమవుతున్న సమయంలో స్టేజీ వెనుక ఆమె స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె వెన్నెముకలో సమస్య కారణంగా నాడీవ్యవస్థ దెబ్బతిని పక్షవాతం సోకినట్లు వైద్యులు వివరించారు. దీంతో లియాంగ్ ఆశల ప్రపంచం కుప్పకూలిపోయింది. భవిష్యత్తు అంధకారంగా మారింది.
ఆసుపత్రిలో చూపిన ఆదరణతో..
అప్పటికి లియాంగ్ వయసు 21. జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం కావాలన్న నిజాన్ని తట్టుకోవడం ఆమెకు కష్టమైంది. అతి కష్టం మీద చికిత్స వల్ల ఆమె ఛాతీ పైభాగంలో కదలికలు వచ్చినా కింద భాగమంతా పక్షవాతం నుంచి కోలుకోలేకపోయింది. తనకా జీవితం వద్దని, తొందరగా మృత్యువును చేరుకుంటే బాగుండునని లియాంగ్ భావించింది. తీవ్ర నిర్వేదానికి గురైంది. అయితే ఆసుపత్రిలో ఇతర రోగుల తీరు ఆమెలో మార్పు తెచ్చింది. అక్కడందరూ ఆమెను ప్రేమతో చూసేవారు, పలకరించేవారు, తమ కష్టాలను ఆమెకు వివరించేవారు. ఈ ప్రపంచంలో తనకు మాత్రమే కష్టాలు లేవని, అందరూ ఏదో ఒక రకమైన కష్టంతో బాధపడుతున్నారని లియాంగ్‌కు అర్థమైంది.
తల్లి సహకారంతో మున్ముందుకు..
‘ఎవరూ నా మీద జాలిపడటం నాకు ఇష్టం లేదు. నన్ను అందరితో సమానంగా చూడండి. అదే నాకు ఇష్టం’ అంటారు లియాంగ్. గత పదేళ్లుగా ఆమె అనేక టీవీ, రేడియో కార్యక్రమాల్లోపాల్గొన్నారు. పుస్తకాలు రాశారు. అనేక కార్యక్రమాల్లో తన జీవితం గురించి వివరించి తోటివారితో స్ఫూర్తి నింపారు. ఇవాళ్టికీ టీవీలో కార్యక్రమం ఉందంటే మూడు గంటల ముందే ఇంటి నుంచి బయలుదేరి స్టూడియోకు చేరుకుంటారు. ‘పనిలో చిన్న ΄÷రపాటు జరగడం కూడా నాకు ఇష్టం ఉండదు.
అందుకే అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటాను’ అంటారామె. ఆమె రోజూ వచ్చి పని చేసేందుకు తల్లి అండగా నిలబడ్డారు. లియాంగ్ కోసం వీల్ చెయిర్ మోసుకొస్తూ, అనేకమార్లు సహాయకురాలిగా వ్యవహరించారు. తన తల్లి తనకు అందించే మద్దతు వల్లే తాను తిరిగి ఈ స్థాయిలో ఉన్నానని అంటారు లియాంగ్. ‘పని లేకపోతే నా స్థితి నాకింకా గుర్తుకొచ్చి ఇబ్బంది పెడుతుంది. పనిలో పడితే నా ఇబ్బందిని పూర్తిగా మర్చిపోతాను. ఉత్సాహంగా పని చేస్తాను’ అంటున్నారు లియాంగ్.
ఆలోచనలను మార్చిన చైనీస్ రచయిత
లియాంగ్ ఆరోగ్యం కొంత మెరుగైన తర్వాత ప్రఖ్యాత చైనీస్ రచయిత షి టీషెంగ్‌ని కలిసింది. ఆయన కూడా ఒక ప్రమాదం కారణంగా 21 ఏళ్లకే చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. అయితే తనలోని ప్రతిభను ఆ సమస్య అడ్డుకోలేదని నిరూపిస్తూ అనేక పుస్తకాలు రాశారు. ఆయన లియాంగ్‌కి కౌన్సెలింగ్ ఇచ్చారు. జీవితం ఇక్కడితో ముగిసిపోలేదని, భయపడి పారిపోవడం విజేతల లక్షణం కాదని హెచ్చరించారు. దీంతో లియాంగ్ ఆలోచనల్లో మార్పు మొదలైంది. కష్టపడి చదివి, బ్రాడ్ కాస్టింగ్ అండ్ హోస్టింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. తిరిగి టీవీ ముందుకు వచ్చి‘వీల్‌చెయిర్ యాంకర్’గా తన ప్రత్యేకత చాటుకుంది.


