ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ (Celina Jaitly) విడాకులకు సిద్దమైంది. భర్త పీటర్ హాగ్ (Peter Haag-48)పై గృహ హింస కేసు దాఖలు చేసి, అతని వల్ల కోల్పోయిన ఆదాయం రూ. 50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నవంబర్ 21న ముంబై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త అయిన హాగ్ కు నోటీసు జారీ అయినట్టు తెలుస్తోంది.
తన భర్త తనను తాను గొప్పగా ఊహించుకుంటాడని (నార్సిసిస్ట్), స్వార్థపరుడని సెలీనా ఆరోపించారు. పిల్లల పట్ల ప్రేమలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను తీవ్ర భావోద్వేగ, శారీరక, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని తెలిపారు. అంతేకాదు ఆస్ట్రియాలో విడాకుల కోసం దాఖలు చేశాడని కూడా ఆమె ఆరోపించింది. ఈ కారణంగానే తాను ఇంట్లోనుంచి పారిపోయి భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే సెలీనా తనకు నెలకు రూ. 10 లక్షల భరణం కోరింది. ముంబైలోని తన నివాసంలోకి ప్రవేశించకుండా అతడిని నిరోధించాలని కోర్టును అభ్యర్థించింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో హాగ్‌తో నివసిస్తున్న వారి ముగ్గురు పిల్లల కస్టడీ కూడా తనకు రావాలని పిటిషన్‌లో కోరింది. పిల్లలు పుట్టిన తరువాత ఏదో ఒక సాకుతో తనను పనిచేసుకోనీయకుండా అడ్డుపడ్డాడని.. తన ఆర్థిక స్వేచ్ఛను, గౌరవాన్ని హరించాడని ఆరోపించింది. అప్పుడప్పుడు చిన్న, చిన్న ప్రాజెక్టులను మాత్రమే చేయగలిగానని వెల్లడించింది.
ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!
కాగా, 2010లో నటి సెలినా జైట్లీ హగ్‌ను పెళ్లాడింది. వీరికి విన్‌స్టన్, విరాజ్, ఆర్థర్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మార్చి 2012లో మగపిల్లలు (ట్విన్స్) పుట్టారు. తిరిగి ఏదేళ్ల తరువాత మళ్లీ ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది, వారిలో ఒకరు హైపోప్లాస్టిక్ గుండె కారణంగా మరణించారు. మాజీ మిస్ ఇండియా చమిస్ యూనివర్స్ రన్నరప్‌గా నిలిచిన సెలీనా.. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, మనీ హై తో హనీ హై, గోల్‌మాల్ రిటర్న్స్, థాంక్యూ లాంటి సినిమాలతో పాపులర్ అయింది. మరోవైపు గత వివాహ వార్షికోత్సవం సందర్భంగా హాగ్ కోసం సోషల్ మీడియాలో సుదీర్ఘమైన రొమాంటిక్ పోస్ట్ కూడా పెట్టింది. ఇంతలోనే ఈ విడాకుల వార్త అభిమానుల్లో అందోళన రేపింది.


