రామన్నపేట: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా తనకు, తన పిల్లలకు ఆస్తిలో వాటా ఇవ్వాలని భర్త దుకాణం ఎదుట భార్య కత్తితో హల్చల్ చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన జ్యోత్స్నకు మెరుగు శ్రీకాంత్ అనే వ్యక్తితో 20 ఏళ్లక్రితం వివాహమైంది. భర్తకు వరంగల్ చౌరస్తాలో జ్యువెలరీ దుకాణం ఉంది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 8 ఏళ్ల కిత్రం విడిపోయారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది.
ఈ క్రమంలో మంగళవారం కోర్టు వాయిదా ఉండగా జ్యోత్స్న హాజరు కాలేదు. బుధవారం తన భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ చేసింది. తన భర్త వేరే మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇంతెజార్‌గంజ్ పోలీసులు అక్కడికి చేరుకుని సదరు వివాహితకు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించగా, ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని వారు తెలపడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ మహిళను కుటుంబ సభ్యులతో పంపించారు.


