సాక్షి, మంచిర్యాల జిల్లా: హృదయ విదారక స్థితిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చనిపోయిన ఆమె చేతిని పెంపుడు పిల్లులు పీక్కుతిన్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) తన రెండో కుమారుడు సమేందర్ దగ్గర ఉంటున్నారు. అతను పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లగా లక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉండిపోయారు.
ఈ క్రమంలో ఆమె గడప తగిలి కింద పడిపోగా తలకు గాయమై అచేతన స్థితికి చేరుకున్నారు. ఇంట్లో లైట్లు వెలగకపోవడం.. అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లిచూడగా కదల్లేని స్థితిలో ఆమె ఉండడం చూసి కుమారులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి ఆమె చనిపోయి ఉన్నారు.
అయితే, ఇంట్లో ఉన్న రెండు పెంపుడు పిల్లలు ఆమె చేతిని చాలా వరకు పీక్కుతినడం స్థానికులను కలచివేసింది. సీఐ పర్స రమేష్, ఎస్సై నరేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


