బెంగళూరు: నకిలీ ఆయుర్వేద దవాఖానా చేతిలో బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి దారుణంగా మోసపోయాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 48 లక్షలు పోగొట్టుకున్నాడు. కారణం తెలిస్తే నెటిజన్లే కాదు మీరు కూడా షాక్ అవుతారు. కొండ నాలుకకు మందిస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టు అయిపోయింది బాధితుడి పరిస్థితి.
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోడ్డు పక్కన నకిలీ ఆయుర్వేద వైద్యుడి వద్దకు వెళ్లాడు. లైంగిక ఆరోగ్య చికిత్స పేరుతో 48 లక్షలు సమర్పించుకున్నాడు. ఉన్న సమస్య తీరడం మాట అటుంచి అశాస్త్రీయమైన వైద్యంతో కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. ఆ నకిలీ మందుల కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలు అతణ్ని చుట్టుముట్టాయి. తరువాత విషయం తెలుసుకుని జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితుడు పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం 2023లో తన వివాహం అయింది. ఈ సందర్భంగా అతనిలోని లైంగిక లోపం బైటపడింది. దీంతో ఒక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయినా ఫలితం లేదు. దీంతో కేఎల్‌ఈ లా కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన కనిపించిన 'ఆయుర్వేదిక్ దవాఖానా' అతణ్ని ఆకర్షించింది. 'విజయ్ గురూజీ'గా పరిచయం చేసుకున్న అందులోని వ్యక్తి, తన దగ్గరున్న అరుదైన మందులతో సమస్యను శాశ్వతంగా నయం చేస్తానని నమ్మించాడు.
ఆయుర్వేద గూడారం మోసం
మే 3న, బాధితుడు లైంగిక సమస్యలకు 'త్వరిత నివారణ' హామీ ఇస్తూ యశ్వంత్‌పూర్‌లోని ఆయుర్వేద స్టోర్ నుండి 'దేవరాజ్ బూటీ' కొని వాడమని సిఫారసు చేశాడు. దీన్ని ప్రత్యేకంగా హరిద్వార్ నుండి తీసుకువచ్చామని, గ్రాముకు రూ. 1.6 లక్షలు ఖర్చవుతుందని గురూజీ బాగా నమ్మించాడు.
అప్పు చేసి మరీ, రూ. 48 లక్షలు
దొంగ గురూజీ మాటల్ని బాగా విశ్వసించిన టెక్కీ, ఆ మందును కొన్నాడు. ఈసారి మరో ఖరీదైన మందుతో వచ్చాడు. 'భావన బూటీ తైలా' అనే మరో మూలికా మిశ్రమాన్ని అతనితో కొనుగోలు చేయించాడు. దీని ధర గ్రాముకు రూ.76,000. దీని కోసం భార్య , తల్లిదండ్రుల నుండి రూ.17 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇక్కడితో అయిపోలేదు. మందు క్రమంగా వాడాలని లేదంటే, ఇప్పటిదాకా వాడిందంతా వేస్ట్ అవుతుందని భయ పెట్టేశాడు విజయ్ గురూజీ . దీంతో బాధితుడు ఈసారి ఏకంగా బ్యాంకు నుంచి రూ. 20 లక్షల రుణం తీసుకున్నాడు. ఇలా మొత్తంగా గురూజీని నమ్మి 48 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. కానీ ఫలితం శూన్యం. పైగా ఆరోగ్యం దెబ్బతింది.
నెటిజన్ల స్పందన
విద్యావంతులు కూడా ఇలా మోసపోవడం షాక్ అంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని, సొంత అనుభవాలను సోషల్ మీడియాలో చాలామంది మొత్తుకుంటున్నా, జనం పిచ్చిగా మోసపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి చిన్ని పట్టణాల్లోనూ, నగరాల్లోనూ లైంగిక ఆరోగ్యం కోసం మందు, హెర్బల్ మందులు అంటూ రోడ్డు పక్కన చాలా దుకాణాలు దర్శనిమిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆయుర్వేద గుడారాల చట్టబద్ధతను పరిశీలించాలని బెంగళూరు వాసులు అధికారులను కోరారు.


