ఖమ్మం క్రైం: ఒక్కొక్కరికీ ఒక్కో కథ.. అందరిదీ ఒకటే వ్యథ.. కన్నవారు ఎవరో తెలియదు, ఉన్నవారు దగ్గరకు రారు. అలాంటి అభాగ్యులకు తనే ఒడి అయ్యింది. కంటికి రెప్పలా కాపాడే నీడ అయ్యింది. కానీ, ఆ నీడ ఇప్పుడు శాశ్వతంగా కనుమరుగైపోయింది.
నిద్రలోనే అనంత లోకాలకు.. ఖమ్మం జిల్లా సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు ఏనుగుల మంజుల (47) కేవలం యూనిఫాం వేసుకున్న ఉద్యోగి కాదు.. వందలాది మంది అనాథలకు ప్రాణం పోసిన ‘అమ్మ’. ‘అమ్మ అనాథ శరణాలయం’ఏర్పాటు చేసి ఎందరో పిల్లల ఆకలి తీర్చి, వారికి భవిష్యత్తునిచ్చారు. గురువారం సాయంత్రం విధి నిర్వహణ ముగించుకుని ఆశ్రమానికి వచి్చన మంజుల, ఎప్పటిలాగే పిల్లలతో ముచ్చటించారు. అనంతరం హాల్‌లోనే నిద్రపోయారు. కానీ, ఆ నిద్ర ఆమెను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్తుందని ఆ పసి ప్రాణాలు ఊహించలేదు.
ఆ గుడ్‌మార్నింగ్ వినిపించలేదు.. శుక్రవారం ఉదయం ‘అమ్మా.. గుడ్ మార్నింగ్.. లే అమ్మా..’అంటూ పిల్లలు మంజుల చుట్టూ చేరి పిలిచారు. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో పక్కనే నివసించే మంజుల కూతురికి చెప్పగా.. ఆమె వైద్యుడిని తీసుకొచ్చింది. అప్పటికే మంజుల గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని వైద్యులు చెప్పడంతో చిన్నారులు కన్నీరు మున్నీరయ్యారు. దిక్కెవరు మాకు?: ‘అమ్మా.. ఇప్పుడు మాకు దిక్కెవరు?అంటూ పిల్లలు మృతదేహంపై పడి రోదిస్తుండటం.. అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మంజుల మృతికి పోలీస్ శాఖ నివా ళులు అరి్పంచగా, ఐసీడీఎస్ అధికారులు పిల్లలను బాలల సదనానికి తరలించారు.


