ఇరిగేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్ సహా 24 మంది అరెస్టు
చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తుండగా నిఘా పెట్టి గుర్తించిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌కు చెందిన కంధాడ శ్రీకాంత్ జీ2 సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. గతంలో హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ సంస్థలో హౌస్ కీపింగ్ బాయ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఓ బాలికపై లైంగిక దాడి చేశాడు. ఆ వీడియోలను తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆన్‌లైన్‌లో సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టీజీసీఎస్‌బీకి ఈ విషయం దృష్టికి వచ్చింది. ఆ వీడియోలోని వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. తాము గుర్తించే వరకు కూడా తమ చిన్నారిపై శ్రీకాంత్ లైంగికదాడికి పాల్పడినట్టు ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియదని టీజీ సీఎస్‌బీ అధికారులు తెలిపారు.
నిజామాబాద్ ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి విదేశీ చిన్నారుల పోర్న్ వీడియోలు బ్రౌస్ చేస్తున్నాడు. వీటిని తన గూగుల్ డ్రైవ్‌తో పాటు మొబైల్ ఫోన్‌లో స్టోర్ చేసుకున్నాడు. సైబర్ టిప్ లైన్ ద్వారా మూడు ఆన్‌లైన్ బ్రౌసింగ్‌లను సీఎస్‌బీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్ సీఎస్‌బీ యూనిట్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేశారు.
చిన్నారుల అశ్లీల చిత్రాలు చూస్తున్న ఇరిగేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్ సహా 24 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) గురువారం అరెస్ట్ చేసింది. చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్న వారిపై ఆన్‌లైన్‌లో నిఘా పెట్టిన టీజీ సీఎస్‌బీ అధికారులు ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌లను తనిఖీ చేశారు. 18 ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్నారుల అశ్లీల చిత్రాలు, పోర్న్ వీడియోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వారిని, షేర్ చేయడంతో పాటు డౌన్‌లోడ్ చేసి స్టోర్ చేసుకున్నవారిని గుర్తించేందుకు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేంద్రంగా గత ఫిబ్రవరిలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (సీపీయూ) ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
సీఎస్‌ఈఏఎం (చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్)ను పదేపదే చూస్తున్నట్టు గుర్తించిన 24 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరిలో హైదరాబాద్‌లో 15 మందిని, వరంగల్‌లో ముగ్గురు, నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు సహా మొత్తం 24 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరంతా చైల్డ్ పోర్న్ చూడటంతో పాటు గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకున్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. చిన్నారులకు సంబంధించిన పోర్న్ లేదా అశ్లీల చిత్రాల కోసం బ్రౌస్ చేసిన వారిని అరెస్ట్ చేసి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. సీఎస్‌బీ అధికారులను డీజీపీ శివధర్‌రెడ్డి అభినందించారు.


