విషపూరిత పని సంస్కృతులు రాజ్యమేలుతున్న కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులకు ఆనందాన్ని పంచే బాస్లూ అక్కడక్కడా ఉంటారు. ఎప్పుడూ వర్క్ టెన్షన్లో ఉండే ఓ ఉద్యోగినిని ఇలాగే సర్ప్రైజ్ చేశారు ఆమె మేనేజర్, తోటి ఉద్యోగులు.
బెంగళూరులోని ఓ కార్యాలయంలో పని చేస్తున్న ఐశ్వర్యను ఏదో మీటింగ్ అంటూ రూంలోకి పిలిచారు. దీంతో చేత్తో ల్యాప్టాప్ పట్టుకుని చకాచకా వెళ్లిపోయింది. తలుపు తీసి లోపలికి అడుగు పెట్టగానే ఆమె మేనేజర్ సహా తోటి ఉద్యోగులు మరచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో 2 వేల మంది ఫారోవర్లను చేరుకోవడాన్ని సెలబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించి ఆనందాన్ని పంచారు.
ఈ వీడియోను తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశారు ఐశ్వర్య. "నా కార్పొరేట్ ప్రయాణంలో కొత్త ప్రయత్నాలు చేసేందుకు, ఎదిగేందుకు నిరంతరం ప్రోత్సహించే గొప్ప బాస్ దొరికినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని" అంటూ తన అనుభూతిని పంచుకున్నారు.
ఎప్పుడూ మా బాస్ అలాంటోడు.. ఇలాంటోడు.. అంటూ బాస్ల రాక్షసత్వాల గురించే వినే సోషల్ మీడియాలో ఈ మంచి బాస్ వీడియో వైరల్గా మారింది. ‘భలే మంచి బాస్’ అంటూ కామెంట్లు చేశారు నెటిజనులు.


