బెంగళూరు: అనుమానాస్పదంగా మహిళా టెక్కీ మృతిచెందిన ఘటన ఈ నెల 3 తేదీన రామమూర్తినగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుబ్రమణ్య లేఔట్‌లో జరిగింది. మృతురాలు శర్మిలా (34) ఇంట్లో శవమై తేలింది. వివరాలు.. మంగళూరుకు చెందిన శర్మిలా గత ఏడాది నుంచి బెంగళూరులో ఓ కంపెనీలో టెక్కీగా పనిచేస్తోంది. 3వ తేదీ రాత్రి 10.30 సమయంలో ఆమె ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంటి యజమాని విజయేంద్ర చూసి రామమూర్తినగర పోలీసులకు సమాచారం అందించారు.
వారు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. సోఫా, తెరలు, బెడ్‌షీట్లు కాలిపోగా శర్మిలా స్పృహ కోల్పోయినట్లు కనబడింది. మంటలు అదుపుచేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది, ఆమె మృతికి కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.


