ఎన్డీఏ ప్రతిష్టాత్మకమైన పోర్టల్స్ 149వ కోర్సు నుంచి సుమారు 329 మంది క్యాడెట్లు ఉత్తీర్ణులయ్యారు. వారంతా ట్రై సర్వీసెస్ అకాడమీలోని రెండో బ్యాచ్ మహిళలు. మొత్తం 15 మంది మహిళా క్యాడెట్లకు ఈసారి చోటు కల్పించింది డిఫెన్స్ అకాడమీ. వారిలో మొత్తం మెరిట్ ఆర్డర్ పరంగా రాష్ట్రపతి మెడల్‌ని గెలుపొందిన తొలి మహిళా క్యాడెట్‌గా ఘనత సాధించిందామె. ఇంతకీ ఎవరామె..? ఆమె ఈ ఘనతను ఎలా సాధించగలిగిందంటే..
ఇప్పటి వరకు ఇద్దరు మహిళా క్యాడెట్లు విద్యారంగంలో అగ్రస్థానంలో నిలిచారు. ఒకరు 148వ కోర్సులో కాగా, మరొకరు 149వ కోర్సులో. ఈ ఏడాది డిపెన్స్ అకాడమీ 149వ కోర్సులో మెరిట్ క్రమంలో గెలుపొందిన తొలి మహిళ సిద్ధి జైన్. దీన్ని మొత్తం మెరిట్ జాబితా, విద్యారంగం, బహిరంగ శిక్షణ, సామూహిక శిక్షణ, అధికారిలాంటి లక్షణాలు, ప్రత్యేక సేవా అంశాలతో కూడిన పనితీరు తదితరాల ఆధారంగా రూపొందించారు.
ఈ ఏడాది రాష్ట్రపతి బంగారు పతకాన్ని ఆల్ఫా స్క్వాడ్రన్‌కు చెందిన అకాడమీ క్యాడెట్ అడ్జుటెంట్ దీపక్ కంద్‌పాల్కి, రాష్ట్రపతి వెండి పతకాన్ని ఆస్కార్ స్క్వాడ్రన్‌కు చెందిన అకాడమీ క్యాడెట్ కెప్టెన్ సిద్ధార్థ్ సింగ్, రాష్ట్రపతి కాంస్య పతకాన్ని కిలో స్క్వాడ్రన్‌కు చెందిన డివిజనల్ క్యాడెట్ కెప్టెన్ సిద్ధి జైన్లు అందుకున్నారు. ఈ మేరకు పాసింగ్ అవుట్ క్యాడెట్లను ఉద్దేశించి అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ..ఈరోజు పట్టభద్రులవుతున్న రెండవ బ్యాచ్ మహిళా క్యాడెట్లను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది.
వారిలో సుమారు 15 మంది తమ పురుష సహచరులతో సమానంగా భుజం భుజం కలిపి నిలబడ్డారు. సేవ ఒకే ప్రమాణాన్ని గౌరవిస్తుందనేది ఈ ఘటన పునరుద్ఘాస్తోందని అన్నారు. ఇక వైమానిక దళంలో చేరనున్న సిద్ధి మాట్లాడుతూ.."మేము ఈ శిక్షణలో అనేక ఒడిదడుకులను చవిచూశాం. ప్రతి దశలోనూ మాకు మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయుల నుంచి, కుటుబం నుంచి పుష్కలంగా మద్దతు, ప్రేమ లభించింది. అందువల్లే అకాడమీలో సవాలుతో కూడిన శిక్షణ సాధ్యమైందని పేర్కొంది."
అలాగే ఎన్డీఏ మహిళా క్యాడెట్లను చేర్చుకోవడాని కంటే ముందు తాను ఇంజనీరింగ్ కోర్సులో చేరి ఆపై సాయుధ దళాలలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆ లక్ష్యంతో నేఐఐటీ జేఈఈ కోసం సన్నద్ధమైనట్లు వెల్లడించింది. అయితే ఇంతలో ఎన్డీలో మహిళా క్యాడెట్ల చేరేలా మార్గం సుగమం కావడం..అందులో తాను చేరడం చకచక జరిగిపోయిందని, పైగా అందుకు తన కుటుంబం పూర్తి స్థాయిలో సహకరించిందని చెప్పుకొచ్చింది.
కాగా, యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ, ఇండియన్ నావల్ అకాడమీ పరీక్షలకు అర్హత ఉన్న మహిళలు హాజరు కావడానికి ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించగా, ఆగస్టు 2021లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు తర్వాత NDAలోకి మహిళల ప్రవేశం సాధ్యమైంది. ఆ నేపథ్యంలోనే 148వ కోర్సులో భాగంగా 2022 జూలై-ఆగస్టులో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ NDAలో చేరింది.
(చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!)


