
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బంద్ విజయవంతమైంది. బీసీ బంద్‌లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇక, బంద్ సందర్భంగా దాడులకు పాల్పడుతూ ఓవరాక్షన్ చేసిన ఎనిమిది మందిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పలు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.
తెలంగాణవ్యాప్తంగా బీసీ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో షాపులపై దాడులు చేసిన వారిపై పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. బంద్ సందర్బంగా విద్యానగర్ నుంచి బర్కత్‌పురా వరకు బీసీ జేఏసీ నేతలు ర్యాలీగా వచ్చారు. అనంతరం, పలువురు కార్యకర్తలు, నేతలు.. పలు షాపులు, షోరూమ్స్, పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. దీంతో, దాడులపై నల్లకుంట, కాచిగూడ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దాడులకు పాల్పడిన ఎనిమిది మంది బీసీ జేఏసీ ప్రతినిధులను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.