
దీపావళి అంటే ఒక పండుగ మాత్రమే కాదు.. విభిన్న రకాల సంబరాల కలగలుపు వేడుక. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం మొదలు.. క్రాకర్స్ కాల్చడం వరకూ ఈ పండుగ ఆస్వాదించదగిన ఎన్నో అనుభూతులను మనకు అందిస్తుంది. అందుకే ఈ ఫెస్టివల్‌లో మన లుక్స్ ద్వారా గుడ్‌విల్ అందుకోవాలంటే, తగిన వస్త్రధారణ తప్పనిసరి. ఇందుకోసం తరచూ బాలీవుడ్ నటీనటుల స్టైల్స్‌ను సిటీ యూత్ అనుసరిస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్‌స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ అందిస్తున్న కొన్ని సూచనలు..
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ధరించిన ఒక డ్రెస్.. ఒక టాంగీ నారింజ మిర్రర్–వర్క్ బ్లేజర్ కోర్డ్ సెట్ దీపావళి పార్టీకి సరైన ఎంపిక. ముఖ్యంగా పండుగ వేళ మెరుపులు విరజిమ్ముతూ.. అదే సమయంలో సౌకర్యవంతంగా ఉండాలనుకునేవారికి ఇవి సరైనవి.
మినిమలిస్ట్ లుక్..
ఉత్తరాది ప్రేక్షకుల్ని ఉర్రూతలూంచే అనన్య పాండే దీపావళి కోసం మినిమలిజాన్ని సూచిస్తున్నారు. సున్నితమైన తెల్లటి ఎంబ్రాయిడరీతో అలంకరించిన లేత గులాబీ రంగు స్లీవ్‌లెస్ కుర్తాను, మ్యాచింగ్ పలాజో ప్యాంటు జత చేశారు. ఓపెన్ హెయిర్ మినిమల్ మేకప్‌తో, పండుగ డ్రెస్సింగ్‌కు ‘తక్కువలో ఎక్కువ’ విధానాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తున్నాయి.
రెడ్ గ్లామ్ లుక్..
దీపావళికి మరో సిల్వర్ స్క్రీన్ క్వీన్ మౌని రాయ్ లాగా ఆల్–రెడ్ లెహంగాలో అబ్బురపరిచవచ్చు. కాంబినేషన్‌గా ఫుల్–స్లీవ్డ్ బ్లౌజ్, ప్రింటెడ్ బోర్డర్లతో మ్యాచింగ్ స్కర్ట్, గోల్డెన్ షిమ్మర్‌తో అంచులున్న కో–ఆర్డినేటింగ్ దుపట్టా ఉన్నాయి. బంగారు చోకర్ నెక్లెస్, మాంగ్ టిక్కాతో తన అద్భుతమైన ఎథి్నక్ లుక్ కంప్లీట్‌గా తీర్చిదిద్దుకుంది.
లాంగ్ ఎథినిక్ జాకెట్లు..
పొడవాటి ఎథ్నిక్ జాకెట్లు పండుగ వార్డ్‌రోబ్‌కు చక్కదనాన్ని జోడిస్తాయి. సరళమైన కుర్తాపై అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్‌ను జత చేయాలి లేదా క్యాజువల్, చిక్ ఫ్యూజన్ లుక్ కోసం క్రాప్ టాప్ స్కర్ట్‌తో స్టైల్ సెట్ చేసుకోవచ్చు. ఈ స్టైలిష్ లేయర్ డ్రెస్సింగ్.. ట్రెండీగా సాయంత్రపు సమావేశాలకు సౌకర్యవంతంగా ఉంటూనే సంప్రదాయాన్ని జోడిస్తుంది.
సింపుల్ లాంగ్ గౌన్లు..
సొగసైన పాస్టెల్ లేదా మ్యూట్ షేడ్స్‌లో ఉన్న పొడవైన, తక్కువగా అలంకరించిన గౌన్లు దీపావళికి స్టైలిష్ ఎంపిక. అవి చక్కదనంపై రాజీ పడకుండా సౌకర్యంపై దృష్టి పెడతాయి. పండుగ రూపాన్ని పూర్తిగా ప్రతిబింబించాలంటే.. దీనికి దుపట్టా లేదా లైట్ జ్యువెలరీ జోడించాలి.
పాతవే కొత్తగా..
ప్రస్తుత వార్డ్‌రోబ్ నుంచి కొన్నింటిని విడివిడిగా తీసి కలపడం ద్వారా అదనపు ఖర్చు చేయకుండా కూడా తాజా పండుగ స్టైల్‌ను సృష్టించవచ్చు. కొత్త పలాజోలతో పాత కుర్తీని జత చేయడం లేదా సరదాగా ఫ్యూజన్ వైబ్ కోసం జీన్స్‌తో భారీ దుపట్టాను కలిపేయడం.. వంటి ట్రిక్స్ ఫాలో అవ్వవచ్చు. ఇది మన డబ్బు ఆదా చేయడమే కాకుండా దుస్తులకు వ్యక్తిగత సృజనాత్మక ట్విస్ట్‌ను అందిస్తుంది.
దేశీ డ్రీమ్..
మరీ సింపుల్‌గా వద్దు అనుకుంటే, అలంకరించబడిన షరారా సెట్‌లు రెడీగా ఉన్నాయిు. సీక్విన్స్, జెమ్స్ మెరుపులతో ఇవి లేట్–నైట్ డిన్నర్లు, రూఫ్‌టాప్ పార్టీలకు బెస్ట్. దీని కోసం నటి జాన్వి కపూర్ డ్రెస్ స్టైల్ పరిశీలించవచ్చు. ఆధునిక, ఆకర్షణీయమైన ట్విస్ట్ కోసం దుపట్టాను కేప్‌గా ధరించవచ్చు.
బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది లాగా నల్ల కుర్తా స్ట్రెయిట్–ఫిట్ ప్యాంటు లుక్ కూడా బాగుంటుంది. లీనియర్ రెడ్ మోటిఫ్ డీటెయిలింగ్‌తో అలంకరించిన, వదులుగా ఓపెన్ జాకెట్‌తో పొరలుగా ధరించడం ఆధునిక సంప్రదాయాల స్టైలిష్ మిశ్రమం.
వేదంగ్ రైనా లా నల్ల కుర్తా స్ట్రెయిట్ ప్యాంటులో మెరిసిపోవచ్చు, సమకాలీన పండుగ లుక్ కోసం మెరిసే నల్ల బ్లేజర్‌తో లుక్‌ను మరింత మెరిపించవచ్చు.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌ని గమనిస్తే.. తరచూ క్లాసిక్ సిల్హౌట్‌లతో సమకాలీన కట్‌లను మిళితం చేస్తాడు. ఇటీవలి దీపావళి లుక్‌లో పొట్టి కుర్తా ఎరుపు రంగు స్ట్రెయిట్ ప్యాంటు నమూనా నెహ్రూ జాకెట్‌తో కలిగి ఉంది ఆధునిక పండుగ డ్రెస్సింగ్‌కి ఇది సరైన ఉదాహరణ.
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌లా చాలా సింపుల్ స్టైల్‌ని ఎంచుకోవచ్చు. ఆయన ధరించిన పాస్టెల్–రంగు లినెన్ కుర్తా–పైజామా సౌకర్యం, సరళమైన కాలాతీత శైలి అని చెప్పొచ్చు.