పంచభూతాల్లో భాగమైన నింగి, నేల, నీరు, వాయువులను ఎదురీది సాహసోపేతమైన ప్రయాణం చేయడం మనుషులకు సాధ్యమేనా అంటే.., ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం, మనో సంకల్పం ఉంటే సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ‘ఐన్ మ్యాన్’ చాలెంజ్ పూర్తి చేసిన సాహసికుడు కళాలి జై సింహ గౌడ్. ప్రపంచంలోని వివిధ ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించడం, మహాసముద్రాలను ఈదడం, అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఫుల్ మారథాన్‌లు పూర్తి చేయడం, బాడీ బిల్డింగ్‌లో సత్తా చాటడం.. అన్నింటికీ మించి ‘మేక్ ఫిట్ ఇండియా’లో భాగంగా ఫిట్నెస్‌పై అందరికీ అవగాహన కల్పించడం తన వృత్తి, ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఎవరెస్ట్ అధిరోహణం వంటి లక్ష్యాలతో తన భవిష్యత్ ప్రణాళికలు నిర్దేశించుకుంటూనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఫిట్నెస్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
యూరప్‌లోనే అత్యంత ఎత్తైన మంచు శిఖరం మౌంట్ ఎల్బ్రస్.. 18,600 అడుగుల ఎత్తులో ఎముకలు కొరికే 14 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రతల్లో ఈ మహా పర్వతాన్ని గతంలోనే అధిరోహించి జాతీయ జెండాతో పాటు జై తెలంగాణ పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు నగరానికి చెందిన జై సింహ.
అంతేకాకుండా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వత శిఖరాల్లో ప్రసిద్ధి చెందిన కిలిమంజారో పర్వతాన్ని సైతం అధిరోహించారు. అంతేకాకుండా లద్దాక్‌లోని కాంగ్ యాట్సే 1, 2 పర్వతాలను సైతం ఈ లిస్ట్‌లో చేరిపోయాయి. పర్వతారోహణతో పాటు.. లద్దాక్ వేదికగా 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, హైదరాబాద్ నగరంలో ఎన్‌ఎండీసీ ఫుల్ మారథాన్.. వీటితో పాటు పలు ప్రతిష్టాత్మక మారథాన్‌లు పూర్తిచేశారు.
ఇదే నెల ప్రారంభంలో గోవా వేదికగా మిరామర్ బీచ్‌లో నిర్వహించిన 5వ ఎడిషన్ ఐరన్ మ్యాన్ 70.3లో ఏకకాలంలో 1.9 కిలో మీటర్ల స్విమ్మింగ్, 90 కిలో మీటర్ల సైక్లింగ్, 21.1 కిలో మీటర్ల రన్నింగ్ పూర్తిచేసి సత్తాచాటారు. 46 ఏళ్ల ఈ పర్వతారోహకుడు, బాడీబిల్డర్, ఫిట్నెస్ ట్రైనర్.. రంగాల్లో రాణిస్తూ.. మొత్తంగా ఐరన్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. ఈ స్ఫూర్తితో మరిన్ని పర్వతాలు అధిరోహించడానికి సన్నద్ధమవుతున్నారు.
ఫిట్నెస్ అవగాహనే లక్ష్యం..
ఓవైపు వ్యక్తిగతంగా ప్రపంచ రికార్టులు తన ఖాతాలో వేసుకుంటన్నారు. మరోవైపు విభిన్న కార్యక్రమాలతో సామాజికంగా అందరికీ శారీరక ఆరోగ్యం అవసరమని అవగాహన కలి్పస్తున్నారు. మారథాన్‌లు, ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నగరంలో ‘సిమ్ లయన్ ఫిట్‌నెస్’ సెంటర్లు ప్రారంభించి ఔత్సాహికులకు ఫిట్నెస్, జిమ్ సేవలు అందిస్తున్నారు.
ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్ వంటి ప్రాంతాల్లో జిమ్ సేవలతో పాటు బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తూ సామాజిక దృఢత్వానికి తానొక పునాదిలా నిలుస్తున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షనిస్ట్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన జై సింహ.. ఫిట్నెస్ రంగాన్ని విస్తృతం చేయాలనే లక్ష్యంతో వాటన్నింటికీ స్వస్తిపలికానని తెలిపారు. వచ్చే ఏడాది అర్జెంటీనాలోని అకాన్‌గువా పర్వతంతో పాటు ప్రపంచంలో మరో ఎత్తైన పర్వతం ఎవరెస్టును సైతం అధిరోహించనున్నారు.
ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తున్న నగరవాసి
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి నగరానికి వచి్చన నేను.. ఫిట్నెస్‌ను జీవిత లక్ష్యంగా మార్చుకుని ఖండాంతరాల్లోని ఎత్తైన శిఖరాలపై దేశ ఖ్యాతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా. వచ్చే ఏడాది జనవరి 9న అర్జెంటీనాలోని అకాన్‌గువా పర్వతాన్ని, తదుపరి మార్చ్ నెలలో ఎవరెస్ట్ పర్వతారోహణకు సన్నద్ధమవుతున్నా.
అంతేకాకుండా ఓషన్‌మ్యాన్‌గా రికార్డు సృష్టించేందుకు మహాసముద్రంలో 10 కిలోమీటర్ల స్విమ్మింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఈ తరం యువతలో శారీరక క్రమశిక్షణ, వ్యాయామ అభిరుచి పెంచడం, అరోగ్య సంరక్షణలో ఫిట్నెస్ ప్రాధాన్యతను తెలియజేయడం,
శారీరక ఆరోగ్యంపై అవగాహన
కల్పించడం సంకల్పంగా ముందుకు సాగుతున్నా. ఫిట్ ఇండియా భవిష్యత్ కార్యాచరణ, ఇప్పటి వరకూ చేసిన పర్వతారోహణలన్నీ సిమ్ లయన్ ఫిట్‌నెస్ ప్రయత్నంలో సొంత ఖర్చులతోనే పూర్తి చేశాను. తదుపరి తలపెట్టిన పర్వతారోహణకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తుల నుంచి స్పాన్సర్‌షిప్ లభిస్తే దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. గోవాలో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 నేపథ్యంలో పోటీదారులను మోదీ అభినందించిన విధానం నాలో మరింత స్ఫూర్తి నింపింది.
– కళాలి జై సింహ గౌడ్, ఫట్నెస్ నిపుణుడు
(చదవండి: Cancer Fighting Foods: ఏయే కూరగాయలు, పండ్లు కేన్సర్‌కి చెక్‌పెడతాయంటే..!)


